1
2.1

2.2
3


4 5

Wednesday, 30 September 2015

సుందరకాండ - 30

ఆ లంబగిరి పర్వతం మీద దిగిన హనుమంతుడు సముద్రం వంక చూసి "రాముడి అనుగ్రహం ఉండాలి కాని ఇలాంటి యోజనముల ఎన్ని అయినా దాటి వస్తాను" అన్నాడు.

ధృతి-దృష్టి-మతి-దాక్ష్యం అనే ఈ నాలుగింటిని ఎవరు తమ పనులలో కలుపుకుంటున్నారో వారికి జీవితంలో ఓటమి అన్నది లేదు అని వాల్మీకి మహర్షి చెప్పారు. ధృతి అంటె పట్టుదల, దృష్టి అంటె మంచి బుద్ధితో ఆలోచించగల సమర్ధత, మతి అంటె బుద్ధితో నిర్ణయించవలసినది, దాక్ష్యం అంటె శక్తి సామర్ధ్యాలు. 

ఆ పర్వతం మీద దిగిన హనుమంతుడు విశ్వకర్మ నిర్మితమైన లంకా పట్టణం యొక్క సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఈ లంకా పట్టణాన్ని సొంతం చేసుకోవడం ఆ దేవతల వల్ల కూడా కాదు అని అనుకొని, ఈ రూపంతో సీతమ్మని వెతకడం కష్టం కనుక పిల్లంత రూపంలో సీతమ్మని వెతుకుతాను అనుకున్నాడు. చీకటి పడ్డాక ఆయన పిల్లంత స్వరూపాన్ని పొంది లంక యొక్క రాజద్వారము దెగ్గరికి వెళ్ళాడు. 

అక్కడికి వెళ్ళేసరికి వికటాట్టహాసం చేస్తూ పర్వతం అంత ఆకారంతో ఒక రాక్షస స్త్రీ కనపడింది. ఆమె హనుమంతుడిని చూడగానే "నువ్వు ఎవరు?. అరణ్యములలో తిరిగే కోతివి, నీకు ఇక్కడ పనేంటి? ఇక్కడికి ఎందుకొచ్చావు?" అని అడిగింది.

హనుమంతుడు అన్నాడు "ఓ వికృతమైన కన్నులున్నదాన! నేను ఎందుకు వెళుతున్నానో తెలుసా? ఒకసారి ఆ వనాలని, ఉపవనాలని, చెట్లని, భవనాలని, సరస్సులని చూసి వచ్చేస్తాను. నాకు అనుమతి ఇవ్వు" అన్నాడు. అప్పుడు ఆవిడ అనింది "నేను అనుమతి ఇవ్వడం కాదు, నన్ను గెలిచినవాడు మాత్రమే లోపలికి వెళ్ళగలడు. నువు లోపలికి వెళ్ళడానికి వీలులేదు" అనింది. "సరే ఇంతకీ నువ్వు ఎవరు?" అని హనుమంతుడు ఆ స్త్రీని ప్రశ్నించాడు. అప్పుడామె "నేను లోపలున్న మహాత్ముడైన రావణుడి పనుపున ఈ లంకా పట్టణానికి కాపలా కాస్తుంటాను" అని చెప్పి చట్టుకున్న హనుమంతుడిని తన చేతితో ఒక దెబ్బ కొట్టింది. ఆ దెబ్బకి హనుమంతుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. కుడి చేతితో కొడితే ఈమె చనిపోతుందని, తన ఎడమ చేతితో ఆమెని ఒక్క గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి ఆమె కళ్ళు తేలేసి కిందపడిపోయింది. 

అప్పుడామె అనింది "నన్ను లంక అంటారు. నువ్వు నన్ను గెలిచావు, నేను ఈ రావణాసురుడి బాధ భరించలేకపోతున్నాను, కొన్ని వేల సంవత్సరాల నుండి నన్ను విసిగిస్తున్నాడు. 'ఒక వానరుడు వచ్చి నిన్ను గెలిచిననాడు, నీకు ఈ రావణుడి గొడవ వదిలిపోతుంది' అని బ్రహ్మగారు నాకు వరం ఇచ్చారు. ఇప్పుడు నాకు అర్ధమయ్యింది, ఈ లంకలోని రాక్షసుల పని, రావణుడి పని అయిపోయింది. ఇక నువ్వు లోపలికి వెళ్ళి సీతమ్మని కనిపెట్టు" అని రాజద్వారం తెరిచింది.

అప్పుడు హనుమంతుడు అక్కడున్న గోడమీద నుంచి ఎగిరి లోపలికి ఎడమకాలు పెట్టి దూకాడు. లోపలికి వెళ్ళి ఆ లంకా పట్టణాన్ని చూడగా, ఇది గంధర్వ నగరమా అన్నట్టుగా ఉంది. అక్కడున్న మేడలు, స్తంభాలు బంగారంతో చెయ్యబడి ఉన్నాయి. అన్నిటికీ నవరత్నాలు తాపడం చెయ్యబడి ఉన్నాయి. స్ఫటికములతో మెట్లు కట్టబడి ఉన్నాయి. ఎక్కడ చూసినా దిగుడుబావులు, సరోవరాలతో ఆ ప్రాంతం సోభిల్లుతుంది. ఆ ప్రాంతం చెట్లతో, పక్షులతో, పళ్ళతో, నెమళ్ళ అరుపులతో, ఏనుగులతో, బంగారు రథాలతో అత్యంత రమణీయంగా ఉంది. ఆ రాత్రి పూట ఆకాశంలో ఉన్న చంద్రుడు వెన్నెల కురిపిస్తూ, లోకం యొక్క పాపం పోగొట్టేవాడిలా ఉన్నాడు. ఆ చంద్రుడి ప్రకాశంతో హనుమంతుడు ఆ లంకా పట్టణంలోని వీధులలో సీతమ్మ కోసం వెతుకుతున్నాడు. 

ఆ లంకా పట్టణంలో ఉన్నవాళ్లు దీక్షితులు, కొంతమంది తల మీద వెంట్రుకలన్ని తీయించుకున్నారు, కొంతమంది ఎద్దు చర్మాలు కట్టుకొని ఉన్నారు, కొంతమంది దర్భలని చేతితో పట్టుకొని ఉన్నారు, కొంతమంది అగ్నిగుండాలని చేతితో పట్టుకొని ఉన్నారు. ఒకడు పక్కవాడికి తన ఛాతిని చూపిస్తున్నాడు, కొంతమంది తమ శరీరాలని కనపడ్డ స్త్రీల మీద పడేస్తున్నారు, కొంతమంది ఎప్పుడూ తమ చేతులలో పెద్ద పెద్ద శూలాలు పట్టుకొని ఉన్నారు, కొంతమంది పరస్పరం ఒకడిని ఒకడు తోసుకుంటూ ఉన్నారు, తమ భుజాల బలాలని చూపించుకుంటు ఉన్నారు, ఒకడిని మరొకడు అధిక్షేపించుకుంటు మాట్లాడుకుంటున్నారు. ఆ లంకలో ఒకడు శూలం పట్టుకొని, ఒకడు ముద్గరం, ఒకడు పరిఘ, అలా రకరకములైన ఆయుధములు పట్టుకొని ఉన్నారు. 

అక్కడున్న రాక్షసుల పేర్లు ఏంటంటే, ప్రహస్త, కుంభకర్ణ, మహొదర, విరూపాక్ష, విద్యున్మాలి, వజ్రదంష్ట, సుఖ, సారణ, ఇంద్రజిత్, జంబుమాలి, సుమాలి, రస్మికేతు, సూర్యకేతు, వజ్రకాయ, ధూమ్రాక్ష, భీమ, ఘన, హస్తిముఖ, కరాళ, పిశాచ, మత్త, ధ్వజగ్రీవ, సుకనాస, వక్ర, శట, వికట, బ్రహ్మకర్ణ, దంష్ట్ర, రోమస. 

హనుమంతుడు ఆ రాక్షసుల అందరి ఇళ్ళల్లోకి వెళ్ళి సీతమ్మ కోసం వెతికారు, ఆ సమయంలో రాక్షస స్త్రీలు తమ భర్తలతో కలిసి ఆనందాన్ని పొందుతున్నారు. 

ఆ స్త్రీలందరినీ చూసిన హనుమంతుడు అనుకున్నాడు "మా అమ్మ సీతమ్మ ఇలా ఉండదు. మా సీతమ్మ కనిపించి కనపడకుండా ఉండే చంద్రరేఖలా ఉంటుంది, మట్టిపట్టిన బంగారు తీగలా ఉంటుంది, బాణపు దెబ్బ యొక్క బాధలా ఉంటుంది, వాయువు చేత కొట్టబడ్డ మేఘంలా ఉంటుంది" అంటూ, ఆ లంకా పట్టణాన్ని వెతుకుతూ రావణాసురుడి యొక్క ప్రాసాదం దెగ్గరికి వెళ్ళాడు. 

అది రాక్షసేంద్రుడైన రావణాసురుడి అంతఃపురం. దానికి మొదటి కక్ష్యలో కొంతమంది గుర్రాల మీద కాపలా కాస్తుంటారు. రెండవ కక్ష్యలో ఏనుగుల మీద కొంతమంది తిరుగుతూ ఉంటారు. ఆ వెనక కక్ష్యలో కొంతమంది కత్తులు పట్టుకొని తిరుగుతుంటారు. ఆ తరువాత కక్ష్యలో, ప్రభువు నిద్రలేవగానే ఒంటికి రాయడానికి కొంతమంది చందనం తీస్తుంటారు. తరువాత కక్ష్యలో ఆయన ధరించే పుష్పమాలికలు ఉంటాయి, ఆ వెనకాల ఆయనకి బాగా నిద్ర పట్టడానికి వాద్యపరికరాల మీద సన్నటి సంగీతాన్ని కొంతమంది వాయిస్తూ ఉంటారు.

'ఇంకా అందరూ నిద్రపోలేదు కనుక కొంతసేపయ్యాక రావణ అంతఃపురంలోకి వెళ్ళి చూస్తాను' అని హనుమంతుడు అనుకొని, బయటకి వచ్చి మళ్ళి కొన్ని ఇళ్ళల్లోకి వెళ్ళి చూశాడు. ఆ ఇళ్ళల్లో ఉన్న రాక్షసులు లంకకి పూజ చేస్తూ శంఖాలు, భేరీలు, గంటలు మోగిస్తున్నారు. అక్కడ ఉన్న ఇళ్ళు చూసి "ఇది ఇంద్రపురా, గంధర్వ నగరమా, పొరపాటున నేను స్వర్గలోకానికి వచ్చానా?. అసలు ఇంద్రుడికి ఎన్ని భోగాలు ఉన్నాయో అవన్నీ ఈ లంకా పట్టణంలో కనిపిస్తున్నాయి" అనుకున్నాడు. అక్కడున్న ఇళ్ళల్లో ఎంత గొప్ప పండితుడైనా ఒక దోషాన్ని కూడా చూపలేడు, అంత అద్భుతంగా అక్కడి ఇళ్ళు ఉన్నాయి. దేవతలకి కూడా ఆ ఇళ్ళల్లోకి వస్తే పూజ చేసుకోవాలనిపిస్తుంది. అక్కడున్న కిటికీలు కూడా వజ్ర వైడుర్యాలతో అలంకరింపబడి చాలా అందంగా ఉన్నాయి. ఆ లంకా పట్టణం యొక్క శోభని హనుమంతుడు చాలా బలంతో చూశాడు (లంకా పట్టణం యొక్క సౌందర్యాన్ని చూసి, తాను వచ్చిన కార్యాన్ని మరిచిపోకుండా ఉండాలని, హనుమంతుడు ఆ నగరం యొక్క సౌందర్యాన్ని చూస్తున్నప్పుడు సీతమ్మని కనిపెట్టాలనే విషయాన్ని మనస్సులో బలంగా పెట్టుకొని ఉన్నాడు). ఆ రాక్షసుల ఇళ్లన్నీ వెతికిన తరువాత హనుమంతుడు మెల్లగా రావణ అంతఃపురంలోకి ప్రవేశించాడు.

అప్పుడాయన రావణ అంతఃపురంలో ఉన్న పుష్పక విమానంలోకి ప్రవేశించాడు. (పుష్పక విమానాన్ని మొట్టమొదట విశ్వకర్మ నిర్మించి బ్రహ్మకి ఇచ్చాడు. కొంతకాలానికి కుబేరుడు బ్రహ్మని గురించి తపస్సు చేస్తే, బ్రహ్మదేవుడు కుబేరుడికి పుష్పక విమానాన్ని ఇచ్చాడు. కుబేరుడి తమ్ముడైన రావణుడు ఆయనని చావగొట్టి ఆ విమానాన్ని తెచ్చుకున్నాడు). ఆ పుష్పక విమానంలో కూర్చుని మనస్సులో ఒక ప్రదేశాన్ని ఊహించుకుంటే, అది వాళ్ళని కన్నుమూసి తెరిసేలోగా అక్కడికి తీసుకువెళుతుంది. ఆ పుష్పకానికి వజ్ర వైడుర్యాలతో నగిషీలు పెట్టబడి ఉంటాయి, అందులో సరోవరాలు, పద్మాలు, ఉద్యానవనాలు, బంగారంతో చెయ్యబడ్డ వేదికలు, కూర్చోడానికి ఆసనాలు, పడుకోడానికి తల్పాలు, విహరించడానికి ప్రదేశాలు ఉంటాయి. అందులోకి ఎంతమంది ఎక్కినా, ఇంకా ఒకడికి చోటు ఉంటుంది. అందులో ఉన్న తివాచి మీద ఈ భూమండలం అంతా చిత్రీకరించబడి ఉంది. ఈ భూమి మీద ఎన్ని పర్వతాలు ఉన్నాయో, అవన్నీ ఆ తివాచి మీద చెక్కబడి ఉన్నాయి. అలాగే ఏ పర్వతం మీద ఎన్ని చెట్లు ఉన్నాయో, అన్ని చెట్లు అందులో ఉన్నాయి. వాటితో పాటు ఆ చెట్లకి ఉన్న పువ్వులే కాకుండా ఆ పువ్వులలో ఉన్న కేసరములు కూడా చెక్కబడి ఉన్నాయి. దానికి కొంచెం పక్కనే లక్ష్మీదేవి పద్మములలో పద్మాసనం వేసుకొని, నాలుగు చేతులతో కూర్చున్నట్టుగా, రెండు ఏనుగులు బంగారు కలశములు పట్టుకొని, పద్మపు రేకులతో అమ్మవారిని అభిషేకిస్తున్నట్టుగా అక్కడ ఒక చిత్రం ఉంది. 

అప్పుడు హనుమంతుడు "మా అమ్మ ఇలాంటి స్థలంలో, ఇలా రాక్షసులతో మధ్యం సేవించి, ఆనందంగా ఉండదు. మా అమ్మ కన్నులవెంట వేడి నీరు కారుతూ వక్షస్థలం మీద పడిపోతూ ఉంటుంది, రాముడి చేత కట్టబడిన దీర్ఘమైన మంగళసూత్రం మా అమ్మ మెడలో మెరుస్తూ ఉంటుంది, మా అమ్మ కన్నులకు ఉన్న వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా ఉంటాయి, పరిపూర్ణమైన ప్రేమ కురిపించే కన్నులతో మా అమ్మ ఉంటుంది, వనంలో ఉన్న నెమలిలా మా అమ్మ ఉంటుంది" అనుకుంటూ, పుష్పక విమానం నుంచి కిందకి దిగి, రావణాసురుడు పడుకున్న శయనాగారం వైపు వెళ్ళాడు. 

Tuesday, 29 September 2015

సుందరకాండ - 29

            సుందరే సుందరో రామ: సుందరే సుందరీ కథ:
            సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం
            సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపి:
            సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం?

        పెద్దలైనవారు సుందరకాండ గురించి ఈ మాట అన్నారు, ఇది వాల్మీకి మహర్షి రచించిన శ్లోకం కాదు. 

రాముడు సుందరాతి సుందరుడు, సీతమ్మ గురించి చెప్పనవసరం లేదు, ఆత్మ దర్శనం చేసిన యోగి స్వరూపుడైన సౌందర్యరాశి హనుమంతుడు, ఆ అశోకవనము అంతా సౌందర్యము, లంకా పట్టణం సౌందర్యము, మంత్ర్రం సౌందర్యం. మరి ఈ సుందరకాండలో సుందరం కానిది ఏముంది? సుందరకాండ తత్ తో ప్రారంభమయ్యి తత్ తో ముగుస్తుంది. తత్ అంటె పరబ్రహ్మము. సుందరకాండని ఉపాసనకాండ అంటారు. పరబ్రహ్మాన్ని ఎలా ఉపాసన చెయ్యాలో ఈ కాండ మనకి నేర్పిస్తుంది.

తతొ రావణనీతాయాహ్ సీతాయాహ్ శత్రుకర్షనహ్ |
ఇయెష్హ పదమన్వెష్హ్టుం చారణాచరితె పథి || 

రావణుడి చేత అపహరింపబడ్డ సీతమ్మ తల్లి యొక్క జాడని కనిపెట్టడం కోసం చారణులు (భూమికి దెగ్గరగా ఉండి, సర్వకాలములయందు సుభవార్తలను చెప్పే దేవతా స్వరూపులు) వెళ్ళే మార్గంలో వెళ్ళడం కోసం హనుమ సంకల్పించాడు. ఎవ్వరూ చెయ్యని పనిని చెయ్యడానికి వెళుతున్న హనుమంతుడు ఆ పర్వతం మీద ఒక గొప్ప ఎద్దు నిలబడినట్టు నిలబడి ఉన్నాడు. వైఢూర్యములలా మెరుస్తున్న ఆ పర్వత శిఖరం మీద ఉన్న పచ్చగడ్డిని తొక్కుతూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. అప్పుడాయన బయలుదేరేముందు సూర్యుడికి, ఇంద్రుడికి, వాయుదేవుడికి, బ్రహ్మగారికి, సమస్త భూతములకు నమస్కారం చేసి ప్రయాణానికి సన్నధుడు అవుతున్నాడు. ఆ మహేంద్రగిరి పర్వతం మీద నిలబడి దక్షిణ దిక్కు వంక ఏకాగ్రతతో చూసి గట్టిగా తన పాదాలతో మహేంద్రగిరి పర్వత శిఖరాలని తొక్కాడు. అప్పుడు ఆ చెట్ల మీద ఉన్న పువ్వులన్నీ రాలిపోయి ఆయన మీద పడిపోయాయి. ఆ పర్వతం మీద ఉన్న గుహలు నొక్కుకుపోయాయి. 


హనుమంతుడు తన పాదములతో ఇంకా గట్టిగ ఆ పర్వతాన్ని తొక్కారు. అప్పుడు ఎన్నాళ్ళనుంచో ఆ పర్వతం మీద కలుగులలో ఉన్న పాములు కలుగు నొక్కుకుపోతుందని బయటకి వచ్చేలోపే, ఆ కలుగు నొక్కుకుపోయింది. అప్పుడు కొంత భాగం బయట, కొంత భాగం లోపల ఉండిపోయింది. అప్పుడా పాములు ఆ బాధని తట్టుకోలేక అక్కడున్న శిలలకి కాట్లు వేశాయి. అప్పుడు ఆ విషంలోనుండి పుట్టిన అగ్ని ఆ మహేంద్ర పర్వత శిఖరాలని కాల్చివేసింది. అప్పటిదాకా ఆ పర్వత శిఖరం మీద తమ భార్యలతో ఉన్నటువంటి గంధర్వులు ఒక్కసారి లేచి ఆధారము లేని ఆకాశంలోకి వెళ్ళి నిలబడ్డారు. వాళ్ళు హనుమంతుడిని చూసి ఆశ్చర్యపోయారు.

ఎష్హ పర్వతసంకాషొ హనూమాన్ మారుతాత్మజహ్ |
తితీర్ష్హతి మహావెగహ్ సముద్రం మకరాలయం || 

అక్కడికి దేవతలు, మహర్షులు మొదలైనవారు వచ్చి ఆకాశం అంతా నిండిపోయారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు " ఏమి ఆశ్చర్యం రా, పర్వత స్వరూపమైన శరీరం ఉన్న హనుమంతుడు ఇవ్వాళ ఈ సముద్రాన్ని దాటి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు " అని అనుకుంటూ హనుమంతుడిని ఆశీర్వదించారు. 


అప్పుడు హనుమంతుడు తన తోకని ఒకసారి పైకి ఎత్తి అటూ ఇటూ ఊపి, ఊపిరిని తీసి తన వక్షస్థలంలో నిలబెట్టి, గట్టిగా తన పాదాలతో ఆ పర్వతాన్ని తొక్కి, తొడలని విశాలంగా పక్కకు పెట్టి, ఒకసారి అక్కడున్న వానరాల వంక చూసి "రాముడి కోదండం నుండి విడువబడ్డ బాణంలా నేను లంకా పట్టణం చేరుకుంటాను, అక్కడ సీతమ్మ దర్శనం అయితే సరే, లేకపోతె అక్కడినుండి స్వర్గలోకానికి వెళ్ళి సీతమ్మని వెతుకుతాను. ఒకవేళ సీతమ్మ నాకు స్వర్గలోకంలో కనపడకపోతే, అదే వేగంతో లంకకి తిరిగొచ్చి రావణుడిని బంధించి రాముడి పాదాలకి సమర్పిస్తాను" అని ప్రతిజ్ఞ చేసి, తన పాదాలని పైకెత్తి ఆ పర్వతం మీదనుండి బయలుదేరాడు. 

హనుమంతుడు అలా వేగంగా పైకి లేచేసరికి, కొన్ని వేల సంవత్సరాలనుండి ఆ పర్వతం మీద పాతుకుపోయిన మహా వృక్షాలు వేళ్ళతో సహా ఆయనతో పాటు పైకి లేచిపోయాయి. ఆకాశంలో వెళుతున్న హనుమంతుడి మీద ఆ చెట్లు పుష్పాలని కురిపించాయి. తేలికయిన చెట్లు చాలా దూరం వెళ్ళాయి, బరువైన చెట్లు ముందుగానే పడిపోయాయి. అలా వెళిపోతున్న హనుమంతుడిని చూసినవారికి " ఈయన ఆకాశాన్ని తాగుతున్నాడ, సముద్రాన్ని తాగుతున్నాడ? " అని అనుమానం వచ్చింది. పసుపుపచ్చని కళ్ళతో హనుమంతుడు మెరిసిపోతున్నాడు. ఎర్రటి నోరుతో సూర్యమండలం వెలిగిపోతున్నట్టు ఆయన ముఖం వెలిగిపోతుంది. ఆయన తొడల వేగానికి సముద్రాన్ని చాప చుట్టినట్టు చుట్టి పైకి ఎత్తేసాడు. అప్పుడు ఆ నీళ్ళల్లో ఉన్న తిమింగలాలు, తాబేళ్లు, చేపలు, రాక్షసులు పైకి కనపడ్డారు. హనుమంతుడు ఒక్కొక్కసారి మేఘాలలోకి వెళ్ళిపోయి మళ్ళి బయటకి వస్తూ ముందుకి వెళుతున్నాడు. 


హనుమంతుడు అంత వేగంతో వెళిపోతుంటే కిందనుంచి సాగరుడు చూసి "సాగరములు ఏర్పడడానికి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగర చక్రవర్తి కారణం కనుక, అటువంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడి కార్యం కోసం హనుమంతుడు సాగరం మీద నుంచి వెళుతున్నాడు కనుక, ఆయనకి ఆతిధ్యం ఇవ్వడం మన ధర్మం" అని అనుకొని తనలో ఉన్న మైనాక పర్వతం వంక చూసి "నిన్ను దేవేంద్రుడు ఇక్కడ ఎందుకు వదిలేశాడో తెలుసా? పాతాళ లోకంలో ఉన్న రాక్షసులు అప్పుడప్పుడు సముద్రమార్గం నుండి భూమి మీదకి వచ్చేవారు. వాళ్ళు అలా రాకుండా ఉండడానికి పాతాళానికి ఉన్న పెద్ద రంధ్రానికి నువ్వు అడ్డంగా పడ్డావు. ఇక కింద వాళ్ళు పైకిరారు అని ఇంద్రుడు నిన్ను వదిలేశాడు. కాని నీకు ఉన్న శక్తి వల్ల నువ్వు పైకి, కిందకి, పక్కలకి పెరగగలవు. అందుకని నువ్వు హనుమంతుడికి ఆతిధ్యం ఇవ్వడం కోసమని ఒకసారి పైకి లె, ఆయన నీ శిఖరాల మీద దిగుతాడు" అన్నాడు. 


అప్పుడు ఆ మైనాక పర్వత శిఖరాలు సముద్రము నుండి పైకి వచ్చాయి. బయటకి వచ్చిన ఆ బంగారు శిఖరముల మీద సూర్యకాంతి పడగానే, ఆకాశం అంతా ఎర్రటి రంగు చేత కప్పబడింది. ఆ శిఖరాలని చూసిన హనుమంతుడు "ఓహొ, ఇప్పటివరకూ ఈ శిఖరాలు కనపడలేదు. ఇప్పుడే సముద్రం నుండి ఈ బంగారు శిఖరాలు పైకి వస్తున్నాయి. ఎవరో నా గమనాన్ని నిరోధించడానికి అడ్డువస్తున్నారు" అని అనుకొని, తన వక్ష స్థలంతో ఆ శిఖరాలని ఒక్కసారి కొట్టాడు. ఆ దెబ్బకి శిఖరాలు చూర్ణమయ్యి కింద పడిపోయాయి. 


అప్పుడు మైనాకుడు మనుష్య రూపాన్ని పొంది తన శిఖరముల మీదనే నిలబడి "అయ్యా! మామూలువాడే అతిధిగా వస్తే విడిచిపెట్టము, మరి నువ్వు మాకు ప్రత్యేకమైన ఉపకారం చేసిన విశిష్టమైన అతిధివి. ఉపకారం చేసినవాడికి ప్రత్యుపకారం చెయ్యడం అనేది చెయ్యవలసిన పని. ఇక్ష్వాకు వంశంలోని వారి వల్ల సముద్రము ఉపకారం పొందింది, నీ తండ్రి వాయుదేవుడి వల్ల మేము ఉపకారము పొందాము. (కృత యుగంలో పర్వతాలకి రెక్కలు ఉండేవి. అవి ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగిరి వెళ్ళిపోయేవి. ఆ పర్వతాలు అలా ఎగిరి వెళ్ళిపోతుంటే ఋషులు, జనాలు బెంగపెట్టుకున్నారు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో అన్ని పర్వతాల రెక్కలని నరికేశాడు. ఇంద్రుడు ఈ మైనాకుడి రెక్కలని కూడా నరకబోతుంటే, మైనాకుడి మిత్రుడైన వాయుదేవుడు ఆ పర్వతాన్ని తీసుకెళ్ళి సముద్రంలో పారేశాడు. 'పోనిలే సముద్రంలో పడితే పడ్డాడు కాని, రాక్షసులు బయటకి వచ్చే ద్వారానికి అడ్డంగా పడ్డాడు' అని ఇంద్రుడు ఆ మైనాకుడిని వదిలేశాడు.) అందుకని నువ్వు ఒకసారి నా పర్వత శిఖరముల మీద కూర్చొని కాస్త తేనె తాగి, పళ్ళు తిని విశ్రాంతి తీసుకొని మళ్ళి హాయిగా వెళ్ళిపో" అన్నాడు. 

అప్పుడు హనుమంతుడు ఒక్కసారి ఆ మైనాకుడిని చేతితో ముట్టుకుని "నేను చాలా ప్రీతి పొందాను, నువ్వు నాకు ఆతిధ్యం ఇచ్చినట్టె, నేను పొందినట్టె, నా మీద కోపం తెచ్చుకోకు. ఎందుకంటే నేను చెయ్యవలసిన చాలా ముఖ్యమైన పని ఒకటి ఉంది. సూర్యాస్తమం అవ్వకుండా నేను వెళ్ళిపోవాలి. నేను ప్రతిజ్ఞ చేసి బయలుదేరాను, మధ్యలో ఎక్కడా ఆగకూడదు" అని చెప్పి వెళ్ళిపోయాడు.

బయటకి వచ్చిన మైనాకుడిని ఇంద్రుడు చూసి "ఓహొ! ఇన్నాళ్ళకి నువ్వు పాతాళం నుండి బయటకి వచ్చావు కదా" అన్నాడు. అప్పుడు మైనాకుడు "ఈ ఇంద్రుడు నా రెక్కలని తరిగేస్తే తరిగేశాడు. ఉపకారం చేసినవారికి ప్రత్యుపకారం చెయ్యకుండా ఈ సముద్రంలో ఎంతకాలం పడి ఉండను" అనుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు అన్నాడు "నాయనా మైనాక! ధైర్యంగా హనుమకి సహాయం చెయ్యడం కోసం బయటకి వచ్చావు. రామకార్యం కోసం వెళుతున్నవాడికి ఆతిధ్యం ఇవ్వడం కోసం బయటకి వచ్చావు కనుక నీ రెక్కలు కొయ్యను" అని అభయమిచ్చాడు. 

అప్పుడు దేవతలు నాగమాత అయిన సురసతో(సురస దక్షుని కుమార్తె) "చూశావ తల్లి, హనుమ వచ్చేస్తున్నాడు. నువ్వు ఒక పెద్ద రాక్షసి వేషంలో వెళ్ళి అడ్డంగా నిలబడి, మింగేస్తానని భయపెట్టి, ఆయన సామర్ధ్యాన్ని పరీక్ష చెయ్యి" అన్నారు. అప్పుడు సురస ఒక భయంకరమైన రూపాన్ని పొంది, సముద్రం నుండి బయటకి వచ్చి హనుమంతుడితో "నిన్ను దేవతలు నాకు ఆహారంగా ఇచ్చారు. నేను నిన్ను తింటాను, కనుక నువ్వు నా నూట్లోకి దూరు" అనింది. అప్పుడు హనుమంతుడు సంతోషంగా రామ కథని సురసకి చెప్పి "నేను సీతమ్మ జాడ కనిపెట్టడం కోసమని వెళుతున్నాను. ఒకసారి సీతమ్మ జాడ కనిపెట్టి, వెనక్కి వెళ్ళి రాముడికి ఆ విషయాన్ని చెప్పి నీ నోట్లోకి ప్రవేశిస్తాను. కాని ప్రస్తుతానికి నన్ను వదిలిపెట్టు తల్లీ. నేను సత్యమే మాట్లాడుతున్నాను, మాట తప్పను" అన్నాడు.

అప్పుడా సురస "అలా కుదరదురా, నాకు బ్రహ్మగారి వరం ఉంది. నువ్వు నా నోట్లోకి ప్రవేశించవలసిందే" అని తన నోరుని పెద్దగా తెరిచింది. అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని బాగా పెంచాడు. సురస కూడా తన నోటిని బాగా పెంచింది. అలా ఇద్దరు 100 యోజనములు పెరిగిపోయారు. అప్పుడు హనుమంతుడు బొటను వేలంత చిన్నవాడిగా అయిపోయి ఆ సురస నోట్లోకి ప్రవేశించి బయటకి వచ్చి "అమ్మా! నువ్వు చెప్పినట్టు నీ నోట్లోకి వెళ్ళి వచ్చేశాను. సరిపోయింది కదా, ఇక నేను బయలుదేరతాను" అన్నాడు.

"ఎంత బుద్ధిబలం రా నీది, రాముడితో సీతమ్మని కలిపినవాడు హనుమ అన్న ప్రఖ్యాతిని నువ్వు పొందెదవుగాక" అని సురస హనుమంతుడిని ఆశీర్వచనం చేసింది. 

అప్పుడు హనుమంతుడు సురసకి ఒక నమస్కారం చేసి ముందుకి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతున్న హనుమంతుడిని సింహిక అనే రాక్షసి సముద్రంలోనుంచి చూసింది. ఆ సింహిక కామరూపి, ఆమెకి నీడని పట్టి లాగేసే శక్తి ఉంది. అప్పుడామె హనుమంతుడి నీడని పట్టి లాగడం మోదలుపెట్టింది. తన గమనం తగ్గుతోందని గమనించిన హనుమంతుడు తన శరీరాన్ని ఒక్కసారిగా పెద్దగా చేశాడు. ఆ సింహిక కూడా తన శరీరాన్ని పెద్దగా చేసింది. మళ్ళి హనుమంతుడు చిన్నవాడిగా తన శరీరాన్ని మార్చి ఆ సింహిక నోటిద్వార లోపలికి ప్రవేశించి ఆమె గుండెకాయని తెంపేసి బయటకి వచ్చేశాడు. గిలగిల తన్నుకొని ఆ సింహిక మరణించింది.

అలా ముందుకి వెళ్ళిన హనుమంతుడు లంకా పట్టణాన్ని చేరుకున్నాక తన శరీరాన్ని చిన్నదిగా చేసి లంబగిరి అనే పర్వతం మీద దిగాడు.

కిష్కింధకాండ పూర్తయ్యింది

రామాయణం యొక్క ఫలశ్రుతి -ఎక్కడెక్కడ రామాయణం చెబుతున్నప్పుడు బుద్దిమంతులై, పరమ భక్తితో రామాయణాన్ని ఎవరైతే వింటున్నారో అటువంటివారికి శ్రీ మహావిష్ణువు యొక్క కృప చేత తీరని కోరికలు ఉండవు. ఉద్యోగం చేస్తున్నవారు, వ్యాపారం చేస్తున్నవారు ఆయా రంగములలో రాణిస్తారు. సంతానం లేని రజస్వలలైన స్త్రీలు ఈ రామాయణాన్ని వింటె, వాళ్ళకి గొప్ప పుత్రులు పుడతారు, తమ బిడ్డలు వృద్ధిలోకి వస్తుంటే చూసుకొని ఆ తల్లులు ఆనందం పొందుతారు. వివాహము కానివారికి వివాహము జెరుగుతుంది, కుటుంబం వృద్ధిలోకి వస్తుంది, వంశము నిలబడుతుంది, మంచి పనులకి డబ్బు వినియోగం అవుతుంది, దూరంగా ఉన్న బంధువులు తొందరలో వచ్చి కలుసుకుంటారు, ఇంటికి మంగళతోరణం కట్టబడుతుంది, ఎన్నాళ్ళనుంచో జెరగని శుభకార్యాలు జెరుగుతాయి, పితృదేవతలు సంతోషిస్తారు.అందరూ రామాయణాన్ని చదివి ఆనందించండి. ఇంత మంచి రామాయణాన్ని చక్కగా చెప్పిన చాగంటి కోటేశ్వర రావు గారికి నా పాదాభివందనాలు.

Wednesday, 23 September 2015

కిష్కింధకాండ - 28

సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం 4 దిక్కులకి వెళ్ళిన వానరములలో 3 దిక్కులకి వెళ్ళిన వానరములు నెల రోజుల తరువాత వెనక్కి తిరిగి వచ్చేశాయి. వాళ్ళు అన్ని ప్రాంతాలని వెతికినా సీతమ్మ జాడ ఎక్కడా కనపడలేదు. 

దక్షిణ దిక్కుకి వెళ్ళిన వానరములు వింధ్య పర్వతం దెగ్గరికి వెళ్ళి, ఆ పర్వతంలో ఉన్న చెట్లని, గుహలని, సరస్సులని, మార్గమధ్యంలో ఉన్న నదులని, పట్టణాలని, గ్రామాలని అన్వేషిస్తూ వెళుతున్నారు. అలా కొంతదూరం వెళ్ళాక నిర్జనమైన అరణ్యానికి చేరుకున్నారు. అక్కడ చెట్లకి ఒక పండు లేదు, ఆకులు లేవు, ఒక జంతువు కూడా కనబడడం లేదు. అక్కడ తినడానికి కనీసం మూలములు కూడా కనపడలేదు. ఒకప్పుడు కణ్డువు అనే మహర్షి ఈ అరణ్య ప్రాంతంలో ఉండేవారు. ఆయన తపఃశక్తికి దేవతలు కూడా భయపడేవారు. అటువంటి సమయంలో కణ్డువ మహర్షి కుమారుడు ఈ అరణ్యంలో శరీరాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు కణ్డువ మహర్షికి ఈ అరణ్యంపట్ల ఒక రకమైన ఖేదం ఏర్పడి ఈ అరణ్యంలో మనుష్యులు కాని, పక్షులు కాని, చెట్లు కాని, జంతువులు కాని ఏమి ఉండవు అని శపించారు. 

వాళ్ళు ఆ అరణ్యాన్ని దాటి ముందుకి వెళ్ళగా, ఒక గుహ నుండి భయంకరమైన ఆకారం కలిగిన రాక్షసుడు బయటకి వచ్చి వానరాల మీదకి పరుగులు తీశాడు. ఆ రాక్షసుడిని చూసి దేవతలు కూడా భయపడతారు. అలా వస్తున్న రాక్షసుడిని చూసిన అంగదుడు వస్తున్నది రావణుడే అనుకొని, తన శక్తినంతా కూడబెట్టి అరిచేతితో ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి రాక్షసుడి నవరంధ్రములనుండి రక్తము కారి కిందపడిపోయి మరణించాడు. అప్పుడు వారు ఆ రాక్షసుడు ఉన్నటువంటి గుహని వెతికారు, కాని ఎక్కడా సీతమ్మ జాడ కనపడలేదు. 

అలా వారు ఎన్ని ప్రాంతాలని వెతికినా ఏమి ప్రయోజనం లేకపోయింది. వాళ్ళకి ఎక్కడా నీరు, ఆహారము దొరకలేదు, దాంతో వాళ్ళకి విపరీతంగా ఆకలి వేసింది. అప్పుడు వాళ్ళు తడిరెక్కలతో ఎక్కడినుంచన్నా పక్షులు వస్తున్నాయేమో అని వెతుకుతున్నారు. అప్పుడు వాళ్ళకి ఒక బిలం నుండి తడి రెక్కలతో పక్షులు రావడం కనపడింది, వాటి వెనకాల కొన్ని జంతువులు తడి శరీరాలతో బయటకి వస్తున్నాయి. అప్పుడా వానరాలు గడ్డితో, లతలతో కప్పబడి ఉన్న ఆ బిలంలోకి ప్రవేశించారు. లోపలికి వెళితే అంతా చీకటిగా ఉంది, అందుకని ఆ వానరాలు ఒకరి చేతులని ఒకరు పట్టుకొని మెల్లగా లోపలికి వెళ్ళారు. 

తీరా లోపలికి వెళ్ళి చూస్తే, అక్కడ లేని వృక్షం లేదు, అక్కడ లేని లత లేదు, చెట్లన్నీ పండ్లతో, పుష్పాలతో పరమ శోభితంగా ఉన్నాయి. ఆ చెట్లకి పెద్ద పెద్ద తేనెపట్లు ఉన్నాయి, అక్కడున్న సరోవరాలలో బంగారంతో చెయ్యబడ్డ తామరపువ్వులు వికసించి ఉన్నాయి. ఆ బంగారు పువ్వు నుండి పడిన పుప్పుడి చేత ఆ సరస్సులలోని నీరు చాలా తీయగా ఉంది. అక్కడ అంతస్తులతో కూడిన మేడలు ఉన్నాయి, ఒక అంతస్తు బంగారంతో, మరొక అంతస్తు వెండితో, మరొక అంతస్తు బంగారంతో, అలా అంతస్తులన్ని బంగారం, వెండితో తాపడం చెయ్యబడి ఉన్నాయి. ఎక్కడ చూసినా వజ్రాలు పొదగబడ్డ బంగారు శయనాలు, ఆసనాలు ఉన్నాయి. ఆ వానరాలు ఈ ప్రాంతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అక్కడ సరోవరాలలో ఉన్న నీటిని తాగి దాహం తీర్చుకున్నారు. 

అప్పుడు వాళ్ళకి కొద్ది దూరంలోనే ఒక స్త్రీ కనబడింది. ఆ స్త్రీ కృష్ణాజినం కట్టుకొని, నారచీర కట్టుకొని, తేజస్సుతో, తపోశక్తితో మెరిసిపోతూ ఉంది. ఆ తల్లి దెగ్గరికి ఈ వానరాలు వెళ్ళి నమస్కరించి "మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. బయట నుంచి చూస్తే చిన్న బిలంలా ఉంది, లోపలికి వస్తే ఇంత అద్భుతంగా ఉంది. అసలు ఈ గుహ ఎవరిది, ఈ మేడలు ఎవరివి. మాకు చాలా చిత్రంగా ఉంది" అన్నారు. 

అప్పుడా స్త్రీ "పూర్వం దానవ రాజు దెగ్గర మయుడనే శిల్పి ఉండేవాడు. ఆ మయుడికి అనేక మాయా శక్తులు ఉన్నాయి. ఆయన బంగారంతో ఈ ప్రాంతాన్ని నిర్మించాడు. ఆ మయుడు బ్రహ్మని గూర్చి 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. మయుడి తపస్సుకి ప్రీతి చెందిన బ్రహ్మదేవుడు ఆయనకి విశేషమైన వరాలని ఇచ్చాడు. తదనంతరం శుక్రాచార్యుల యొక్క ధనమంతా తీసుకొచ్చి మయుడికి ఇచ్చారు. కాని ఆ మయుడు హేమ అనే అప్సరస స్త్రీ యందు మనస్సు పెట్టుకున్నాడని తెలిసి, ఇంద్రుడు ఆయనని తన వజ్రాయుధంతో సంహరించాడు. మయుడు హేమ అనే అప్సరస స్త్రీ యందు మనస్సు పెట్టుకున్నాడు కనుక, ఈ గుహలో ఉన్న సమస్త ఐశ్వర్యము కూడా హేమకి చెందుతుందని బ్రహ్మగారు తీర్పు ఇచ్చారు. అప్పుడా హేమ ఈ ఐశ్వర్యానికి కాపలాగ ఉండడానికి నన్ను నియమించింది. నేను మేరుసావర్ణి యొక్క కుమార్తెని, నా పేరు స్వయంప్రభ. నాకు స్నేహితురాలైన హేమ నృత్యమునందు, సంగీతమునందు ప్రావీణ్యము కలిగిన స్త్రి. ఆమె నన్ను పిలిచి ఈ ఐశ్వర్యాన్ని, గుహని కాపాడమని అడిగింది. స్నేహము మీద ఉన్న అనురక్తి చేత నేను ఈ గుహని కాపాడుతూ ఉంటాను. మిమ్మల్ని చూస్తుంటే బాగా అలసిపోయినట్టున్నారు కనుక మీకు కావలసిన కందమూలాలని, ఫలాలని ఆరగించండి. నీళ్ళు, తేనె కావలసినంత తాగి విశ్రాంతి తీసుకోండి. విశ్రమించిన తరువాత మీరు ఎవరో, ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు చెప్పండి" అనింది. 

అప్పుడా వానరాలు కడుపునిండా కావలసిన పదార్ధాలని తిని విశ్రమించారు. అప్పుడు హనుమంతుడు స్వయంప్రభతో "దశరథ మహారాజు కుమారుడైన రాముడు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం తన భార్య అయిన సీతమ్మతో, తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసానికి వచ్చాడు. కాని సీతమ్మని రావణాసురుడనే రాక్షసుడు అపహరించాడు. అపహరింపబడ్డ సీతమ్మని వెతుకుతూ వాళ్ళు కిష్కిందకి చేరుకున్నారు. అక్కడ వారు సుగ్రీవుడితో మైత్రి కుదుర్చుకున్నారు. సుగ్రీవుడు రాముడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నాలుగు దిక్కులకి వానరాలని పంపించాడు, సీతమ్మని వెతకడం కోసం. దక్షిణ దిక్కుకి యువరాజైన అంగదుడి నాయకత్వంలో వచ్చిన వానర సమూహములో నేను ఒకడిని, నన్ను హనుమ అంటారు. సీతమ్మ జాడ కనిపెట్టడం కోసం వెతుకుతున్న మాకు ఎక్కడా ఆహారం, నీరు దొరకలేదు. అటువంటి సమయంలో తడి రెక్కలతో పక్షులు ఈ గుహ నుండి బయటకి రావడం చూశాము. ఇక్కడ నీళ్ళు దొరుకుతాయనే ఆశతో మేము ఈ గుహలోకి ప్రవేశించాము. సీతమ్మ జాడ మాకు చెప్పగలవా" అని అడిగాడు. 

అప్పుడా స్వయంప్రభ "ఈ గుహలోకి మృగములు తప్ప మిగిలినవి ఎవన్నా ప్రవేశిస్తే, ప్రాణాలతో బయటకి వెళ్ళడం కుదరదు. కాని మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది, అందుకని మీ అందరినీ నా తపఃశక్తి చేత బయటకి పంపిస్తాను. మీరు కళ్ళు మూసుకొని, కళ్ళ మీద చేతులు పెట్టుకోండి" అనింది. 

అప్పుడా వానరాలు మృదువైన కనురెప్పల్ని మూసి, తమ మృదువైన చేతులతో ఆ కన్నులని మూసుకున్నారు. మళ్ళి ఉత్తర క్షణంలో కనులు తెరిచేసరికి వాళ్ళందరూ వింధ్య పర్వతం మీద ఉన్నారు. ఆ ప్రాంతంలోని చెట్లు పువ్వులతో, పండ్లతో శోభిల్లుతుంది. అప్పుడా స్వయంప్రభ "మీరు ఈ గుహలో 4 నెలలపాటు ఉండిపోయారు" అని చెప్పి గుహలోకి వెళ్ళిపోయింది. (ఆ గుహలో వానరాలు గడిపింది కొంత సమయమే అయినా, ఆ గుహలో ఉన్నంత సేపు వాళ్ళకి కాలం తెలీలేదు.) 

అప్పుడు అంగదుడు "మనం ఆశ్వయుజ మాసంలో బయలుదేరాము. కాని ఇప్పుడు వసంత కాలం వచ్చింది. మనని ఒక నెలలోపు తిరిగి వచ్చెయ్యమని సుగ్రీవుడు చెప్పాడు. కాని మనం కొన్ని నెలలు దాటిపోయాము. ఆలస్యం అయితే అయ్యింది కాని ఇందులో సీతమ్మ జాడ తెలిసినవాడు ఎవడన్నా ఉన్నాడా?, ఎవడూ లేడు. సుగ్రీవుడు చాలా క్రోధ స్వరూపుడు, సుగ్రీవుడు ఎలాంటివాడో నాకు తెలుసు. ఆయన నన్ను ఇష్టంగా యువరాజుని చెయ్యలేదు, రాముడు చెయ్యమన్నాడని నన్ను యువరాజుని చేశాడు. నేనంటే ఆయనకి చాలా కడుపుమంట. ఇప్పుడు నేను వెనక్కి వెళితే శత్రుత్వం తీర్చోకోవడానికి మంచి అవకాశం దొరికిందని మనందరి కుత్తుకలు కత్తిరిస్తాడు. అందుకని మనం అక్కడికి వెళ్ళద్దు, ఇక్కడే ప్రాయోపవేశం (దర్భలని{గడ్డిని} దక్షిణ దిక్కుకి ఉండేలా పరుచుకొని, తూర్పు దిక్కుకి తిరిగి ఆచమనం చేసి దానిమీద పడుకుంటారు. అప్పుడు అటుగా వెళుతున్న ఏ ప్రాణి అయినా వాళ్ళని తినచ్చు) చేసి చనిపోదాము. నేను వెనక్కి రాను" అన్నాడు. 

అప్పుడు మిగిలిన వానరాలన్నీ అంగదుడి బాధ చూడలేక కళ్ళు తుడుచుకొని, మనమూ ఇక్కడ ప్రాయోపవేశం చేసేద్దాము అన్నాయి. 

అప్పుడు వాళ్ళల్లో ఒకడైన తారుడు అన్నాడు "అంగదుడు చెప్పిన మాట నిజమే, మనం ఇక్కడ ప్రాయోపవేశం చేసేసి చనిపోదాము. లేదా నాకు ఒక ఆలోచన వస్తుంది, మనం ఆ స్వయంప్రభ గుహలోకి వెళ్ళిపోదాము. అందులో బోలెడన్ని చెట్లు, ఫలాలు, తేనె ఉన్నాయి. అవి తింటూ మనం అందులోనే ఉండిపోవచ్చు" అన్నాడు. 

సామ, దాన, బేధ, దండోపాయములలో ఈ వానరముల మీద సామము కాని, దానము కాని, దండోపాయము కాని పనికిరాదు. అందుకని వీళ్ళ మీద బేధము అనే ఉపాయమును మాత్రమే ప్రయోగించాలి అని హనుమంతుడు అనుకొని, అంగదుడితో "నాయనా అంగదా! నువ్వు చాలా గొప్పవాడివి. ఈ రాజ్యభారాన్ని అంతా వహించగలిగిన శక్తి కలిగినవాడివి. కాని ఇవ్వాళ నీ బుద్ధియందు చిన్న వైక్లవ్యం కనిపిస్తుంది. నువ్వు ప్రాయోపవేశం చేస్తాను, లేకపోతె ఈ గుహలోకి వెళ్ళిపోతాను అంటున్నావు, నీతో పాటు ఈ మిగిలిన వానరాలు కూడా అలాగే చేస్తాము అంటున్నాయి. కాని జెరగబోయే పరిణామం ఎలా ఉంటుందో నేను చెబుతాను, నువ్వు కొంచెం ఆలోచించుకో, ఆ తరువాత నిర్ణయం తీసుకో. 

ఒకవేళ మీరందరూ గుహలోకి వెళ్ళిపోయినా మీతో నేను రాను, జాంబవంతుడు రాడు, నీలుడు రాడు, సుహోత్రుడు రాడు. వెయ్యి పిడుగుల శక్తితో సమానమైన బాణములు లక్ష్మణుడి దెగ్గర చాలా ఉన్నాయి, ఒకవేళ మీరు గుహలోకి వెళ్ళినా లక్ష్మణుడి బాణాలు ఈ గుహని ముక్కలు చేస్తాయి. అప్పుడు మీరు ఎలా బ్రతుకుతారు. ఒకవేళ మీరందరూ గుహలోకి వెళ్ళినా కొంతకాలానికి మిగిలిన వానరాలకి తమ భార్యాపిల్లలు గుర్తుకొస్తారు. అప్పుడు వాళ్ళు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అప్పుడు నువ్వు బంధువు అన్నవాడు లేకుండా ఒక్కడివే అయిపోతావు, ఆనాడు ఒక చిన్న గడ్డిపరక కదిలినా నువ్వు భయపడతావు. నువ్వు అన్నట్టు సుగ్రీవుడు అసత్యవాది కాదు, ఆయన కూడా సమ్మతించాడు కనుకనే నీకు యువరాజ పట్టాభిషేకం చేశాడు. నువ్వు తిరిగొచ్చి పరిపాలనచెయ్యి. అన్నిటినీమించి సుగ్రీవుడికి సంతానం లేదు, నువ్వే ఈ రాజ్యానికి వారసుడివి. నామాట నమ్ము, సుగ్రీవుడు నీకు ఎన్నడూ అపాయం కల్పించడు. తిరిగి వెళ్ళి జెరిగిన విషయాలని సుగ్రీవుడికి చెబుదాము" అన్నాడు. 

అప్పుడు అంగదుడు "ఆనాడు మా నాన్న దుందుభిని చంపడానికని ఒక బిలంలోకి ప్రవేశించాడు. కాని సుగ్రీవుడికి రాజ్యము మీద ఉన్న కాంక్ష చేత మా నాన్న తిరిగిరాకుండా ఉండడం కోసమని ఆ బిలద్వారానికి ఒక శిలని అడ్డుపెట్టాడు. మా నాన్న బతికున్నాడని తెలిసి కూడా మా అమ్మని తన భార్యగా అనుభవించాడు. నాయందు కుమారుడన్న ప్రేమ సుగ్రీవుడికి ఎన్నడూ లేదు. నేను తిరిగొస్తే సాకు దొరికిందని నన్ను చంపుతాడు. సుగ్రీవుడి చేతిలో మరణించడం కన్నా ప్రాయోపవేశం చేసి మరణించడం నాకు ఇష్టం. మీరు వెళ్ళి నేను నా పినతండ్రికి, నా తల్లికి, నా పినతల్లికి, పెద్దలకి నమస్కారం చేశానని చెప్పండి" అని చెప్పి, ప్రాయోపవేశం చెయ్యడం కోసమని దర్భల మీద పడుకున్నాడు. 

అప్పుడా మిగతా వానరాలు కూడా అంగదుడిలాగానే దర్భల మీద పడుకున్నారు. అలా కింద పడుకున్నవాళ్ళు రామ కథని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు.

సాంపాతిః నామ నామ్నా తు చిర జీవీ విహంగమః |
భ్రాతా జటాయుషః శ్రీమాన్ ప్రఖ్యాత బల పౌరుషః ||

వీళ్ళందరూ రామ కథ చెప్పుకుంటూ ఉండగా అక్కడున్న కొండ శిఖరం మీదకి ఒక పెద్ద పక్షి వచ్చింది, కాని దానికి రెక్కలు లేవు. ఆ పక్షి ఇంతమంది వానరాలని చూసి 'ఆహా ఏమి నా అదృష్టము, ఒకడిని తింటే మిగిలిన వారు పారిపోతారు, కాని వీళ్ళు ప్రాయోపవేశం చేస్తున్నారు కనుక ఎవరూ కదలరు. మెల్లగా ఒక్కొక్కరిని తినచ్చు' అని ఆ పక్షి అనుకుంది. 

ఆ వానరాలు చెప్పుకుంటున్న రామ కథ వింటున్న ఆ పక్షి గట్టిగా ఒక మాట అనింది "నా మనస్సు కంపించిపోయేటట్టుగా, నా సోదరుడైన జటాయువు రావణాసురుడి చేత వధింపబడ్డాడన్న మాట చెప్పినవాడు ఎవడురా ఇక్కడ. అసలు నా తమ్ముడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు. దశరథ మహారాజు జటాయువుకి స్నేహితుడు, దశరథుడు ఏ కారణం చేత మరణించాడు. నా రెక్కలు కాలిపోయాయి, నా అంతట నేను మీ దెగ్గర కుర్చోలేను. ఎవరన్నా వచ్చి నన్ను దించండిరా" అనింది. 

కాని కింద పడుకున్న వానరాలు ఒకరితో ఒకరు "అదంతా ఒట్టిదే, మనన్ని తినెయ్యడానికి అలా అంటుంది. మనం అక్కడికి వెళితే అది మనన్ని తినేస్తుంది" అన్నారు. 

వాళ్ళల్లో ఒకడు అన్నాడు "అది మనన్ని నిజంగా చంపేసిందే అనుకో, మనం ప్రాయోపవేశం చేస్తున్నాము కదా మరి దానిని తేవడానికి భయం ఎందుకు, వెళ్ళి తీసుకురండి" అన్నాడు. 

అప్పడు అంగదుడు వెళ్ళి ఆ పక్షిని తీసుకొచ్చాడు. అప్పుడా వానరాలన్నీ ఆ పక్షి చుట్టూ చేరాయి. అప్పుడాయన "అసలు మా జటాయువు ఏమయ్యాడు?" అని అడిగాడు. 

అంగదుడు మళ్ళి రామ కథ చెప్పడం ప్రారంభించాడు. అంగదుడు రామ కథ మొత్తం చెప్పి 'నువ్వు ఎవరు?' అని ఆ పక్షిని ప్రశ్నించాడు. 

అప్పుడా పక్షి "సంపాతి అనబడే నేను, జటాయువు సోదరులము. సూర్యుడు ఉదయించినప్పటినుంచి అస్తమించేలోపు ఆయనతో సమానంగా ప్రయాణం చెయ్యాలని మేము ఒకనాడు పందెం కాసుకున్నాము. అనుకున్న ప్రకారం నేను, జటాయువు సూర్యుడి వెనకాల వెళ్ళిపోతున్నాము. అలా వెళుతుండగా మిట్ట మధ్యాహ్నం వేళ మేము సూర్యుడికి దెగ్గరగా వచ్చాము. అప్పుడా సూర్యుడి వేడిని భరించలేక జటాయువు స్పృహతప్పి కిందపడిపోతున్నాడు. పెద్దవాడిని కనుక తమ్ముడిని రక్షించాలని నేను నా రెక్కలని జటాయువుకి అడ్డంగా పెట్టాను. అప్పుడా సూర్యుడి వేడికి నా రెక్కలు కాలిపోయి వింధ్య పర్వతం మీద పడిపోయాను. కాని నా తమ్ముడు ఎటు వెళ్ళిపోయాడో నాకు తెలీలేదు. మళ్ళి ఇంతకాలానికి మీవల్ల నా తమ్ముడి గురించి విన్నాను. నా తమ్ముడు చనిపోయాడన్న వార్త వినడం వల్ల నాకు చాలా బాధ కలుగుతోంది. చనిపోయిన నా తమ్ముడికి జలతర్పణ ఇవ్వాలి అనుకుంటున్నాను, కాని నేను ఎగరలేను. మీరు నన్ను తీసుకెళ్ళి ఆ సముద్ర జలాల దెగ్గర దింపండి, నేను నా తమ్ముడికి తర్పణలు ఇస్తాను" అన్నాడు. 

సంపాతి కోరిక మేరకు వాళ్ళు  ఆయనని సముద్ర తీరానికి తీసుకువెళ్ళారు, ఆయన అక్కడ జటాయువుకి తర్పణలు సమర్పించాడు. 

మళ్ళి వెనక్కి తిరిగొచ్చాక ఆ వానరాలు సంపాతితో "జటాయువు రామకార్యంలో సహాయం చేశాడు, నువ్వు కూడా రామకార్యంలో ఏమన్నా సహాయం చెయ్యగలవా. నీకు సీతమ్మ జాడ ఏమన్నా తెలుసా" అని అడిగారు.

నిర్దగ్ధ పక్షో గృధ్రో అహం గత వీర్యః ప్లవం గమాః |
వాఙ్ మాత్రేణ తు రామస్య కరిష్యే సాహ్యం ఉత్తమం ||

అప్పుడా సంపాతి "రెక్కలు కాలిపోయాయి నాకు, ఇవ్వాళ ఇలా పడి ఉన్నాను, ఇంతకన్నా ఏమి చెయ్యగలను. కాని రామకార్యానికి నేను మాటమాత్రం సహాయం చేస్తాను. సీతమ్మని రావణుడు ఆకాశ మార్గంలో తీసుకెళుతున్నప్పుడు ఆమె ఆభారణాలని కొంగుకి చుట్టి విడిచిపెట్టడం నేను చూశాను. ఆ రావణాసురుడు విశ్రవసోబ్రహ్మ యొక్క కుమారుడు, సాక్షాత్తు కుబేరుడి తమ్ముడు. ఆయన లంకా నగరానికి అధినేత. ఈ సముద్రానికి దక్షిణ దిక్కున 100 యోజనముల అవతల లంక ఉంటుంది. ఆ లంకలో ఎక్కడ చూసినా బంగారు స్తంభములతో నిర్మింపబడ్డ భవనాలు ఉంటాయి. అటువంటి లంకా నగరంలో దీనురాలై,  పచ్చని పట్టు పుట్టం కట్టుకుని, ఏడుస్తూ, చుట్టూ రాక్షస స్త్రీలు ఉండగా సీతమ్మ ఉంది. నాకు ఇవన్నీ ఎలా తెలుసని అడుగుతారేమో, నేను ఇక్కడే కూర్చుని సీతమ్మని చూడగలను. నేను దివ్య దృష్టితో చూడగలను, మాకు ఆ శక్తి ఉంది. ఎందుకంటే, భూమి నుండి ఆకాశానికి కొన్ని అంతరములు ఉన్నాయి. మొదటి అంతరములో తమ కాళ్ళ దెగ్గర ఉన్న ధాన్యాన్ని ఏరుకొని తినే కులింగములు అనే పక్షులు ఎగురుతాయి. రెండవ అంతరంలో చెట్ల మీద ఉండే ఫలాలని తినే పక్షులు ఎగురుతాయి. మూడవ అంతరంలో భాసములు, క్రౌంచములు ఎగురుతాయి. నాలుగవ అంతరంలో డేగలు ఎగురుతాయి. అయిదవ అంతరంలో గ్రద్దలు ఎగురుతాయి. ఆరవ అంతరంలో హంసలు ఎగురుతాయి. ఏడవ అంతరంలో వినతా పుత్రులమైన వైనతేయులము కాబట్టి  మేము ఎగురుతాము. అందుకని మేము తినే తిండి చేత, సహజంగా మేము జన్మించిన జాతి చేత 100 యోజనముల అవతల ఉన్న విషయాన్ని కూడా ఇక్కడే ఉండి చూడగల దృష్టిశక్తి మా కంటికి ఉంటుంది. 

అదుగో దూరంగా లంకా పట్టణంలో, అశోక వనంలో సీతమ్మ కూర్చుని ఉండడం నాకు కనిపిస్తుంది. మీలో ఎవరైనా సాహసం చేసి 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళగలిగిన వాడు ఉంటె, సీతమ్మ యొక్క దర్శనం చెయ్యవచ్చు.

తీక్ష్ణ కామాః తు గంధర్వాః తీక్ష్ణ కోపా భుజంగమాః | 
 మృగాణాం తు భయం తీక్ష్ణం తతః తీక్ష్ణ క్షుధా వయం ||

గంధర్వులకి కామం ఎక్కువ, పాములకి కోపం ఎక్కువ, మృగాలకి భయం ఎక్కువ, పక్షులకి ఆకలి ఎక్కువ. అందుకని నాకు ఆకలి ఎక్కువగా ఉండేది, కాని వెళ్ళి తిందామంటే నాకు రెక్కలు లేవు. నా కొడుకైన సుపార్షుడు రోజూ వెళ్ళి ఆహారం తీసుకోచ్చేవాడు. కాని ఒకనాడు ఆహారం తీసుకురావడానికి వెళ్ళిన నా కొడుకు ఎంతసేపటికీ వెనక్కి రాలేదు. కడుపు నకనకలాడుతూ నేను ఎదురుచూస్తున్నాను. ఇంతలో ఒట్టి చేతులతో నా కొడుకు వచ్చాడు, అది చుసిన నాకు కోపం వచ్చి నా కొడుకుని నిందించాను. అప్పుడు సుపార్షుడు అన్నాడు ' నాన్నగారు! నా దోషంలేదు, నేను పొద్దున్నే వెళ్ళి సముద్రంలో ఉన్న మహేంద్రగిరి పర్వతం మీద కూర్చొని సముద్ర జలాలలోకి చూస్తున్నాను, ఏదన్నా పెద్ద ప్రాణి కనపడగానే తీసుకొచ్చి మీకు పెడదాము అనుకున్నాను. కాని ఇంతలో ఆకాశంలో, నల్లటి స్వరూపంతో ఉన్న రాక్షసుడు, మెడలో తెల్లటి ముత్యాల హారం వేసుకొని, తెల్లటి బట్ట కట్టుకొని వెళుతున్నాడు. మేఘం మీద మెరుపు మెరిస్తే ఎలా ఉంటుందో, అలా ఒక స్త్రీ అతని చేతులలో తన్నుకుంటుంది. హ రామ, హ లక్ష్మణా అని అరుస్తుంది. నేను వాడిని చూసి మంచి ఆహారం దొరికింది అనుకున్నాను. కాని వాడు నా దెగ్గరికి వచ్చి నమస్కరించి 'మహానుభావ! నాకు దారి విడిచిపెట్టవయ్య' అన్నాడు. ఎంతటివాడైన అలా బతిమాలుతు సామంతో మాట్లాడితే, ఇంగిత జ్ఞానం ఉన్నవాడెవడు అటువంటివాడిని దిక్కరించకూడదు కదా, అందుకని నేను వాడిని వదిలిపెట్టేశాను. కాని వాడు వెళ్ళిపోగానే ఆకాశంలో దేవగణాలు, ఋషిగణాలు నా దెగ్గరికి వచ్చి 'అదృష్టవంతుడివిరా బతికిపోయావు, వాడు దుర్మార్గుడు, వాడి పేరు రావణాసురుడు. వాడు చాలా బలవంతుడు, వాడికి విశేషమైన వరాలు ఉన్నాయి' అని చెప్పి వెళ్ళారు. 

ఈ విషయాన్ని నా కొడుకు చెప్పడం వల్ల నాకు సీతమ్మ గురించి తెలిసింది. సీతమ్మని రావణాసురుడే అపహరించి లంకకి తీసుకువెళ్ళాడు. 

నేను వింధ్య పర్వత శిఖరం మీద రెక్కలు కాలిపోయి పడినప్పుడు 6 రోజుల పాటు స్పృహ లేకుండా ఉన్నాను. 6 రోజుల తరువాత తెలివొచ్చింది. నా తమ్ముడు ఎటో ఎగిరిపోయాడు, నాకేమో రెక్కలు కాలిపోయాయి, అందుకని ఆ పర్వతం మీద నుండి కిందకి దూకి మరణిద్దాము అనుకున్నాను, కాని ఇంతలో ఒక ఆలోచన వచ్చింది. మా ఇద్దరికీ రెక్కలు ఉన్న రోజుల్లో నేను నా తమ్ముడు కామరూపులము కాబట్టి మనుష్య రూపాన్ని పొందేవాళ్ళము. అక్కడ ఉండేటటువంటి నిశాకర మహర్షి పాదములకు నమస్కారం చేస్తుండేవాళ్ళము. అందుకని ఒక్కసారి ఆ మహర్షి పాదాలకి నమస్కరించి ప్రాణాలు విడిచిపెడదాము అనుకొని మెల్లగా డేకుతూ ఆ మహర్షి ఉండే ఆశ్రమానికి వచ్చాను. అప్పుడా మహర్షి స్నానం చేసి వెళుతుంటే ఎలా ఉందంటే, అభిషేకం చెయ్యబడ్డ బ్రహ్మగారు వెళుతున్నట్టు ఉన్నారు. బ్రహ్మగారి చుట్టూ ప్రాణులన్నీ ఎలా చేరుతాయో, అలా నిశాకర మహర్షి స్నానం చేసి వెళుతుంటే ఆయన చుట్టూ ఎలుగుబంట్లు, పులులు, సింహాలు, పాములు చేరి ఉన్నాయి. ఆయన లోపలికి వెళ్ళగానే ఆ మృగాలన్నీ వెళ్ళిపోయాయి. తరువాత ఆయన బయటకి వచ్చి నన్ను చూసి 'నిన్ను చాలాకాలం నుండి చూస్తున్నాను, నువ్వు, నీ తమ్ముడు వచ్చి నాకు నమస్కారం చేసేవారు కదా. నువ్వు రెక్కలు కాలిపోయి ఇలా ఉన్నావేంటి' అని అడిగారు. అప్పుడు నేను జెరిగిన కథంతా చెప్పాను. అప్పుడాయన అన్నారు 'సంపాతి! బెంగ పెట్టుకోకు, భవిష్యత్తులో నీ వల్ల ఒక మహత్కార్యం జెరగవలసి ఉంది. నువ్వు కొంతకాలానికి సీతాపహరణాన్ని చూస్తావు. ఈ సీతమ్మని అన్వేషిస్తూ వానరులు వస్తారు. వాళ్ళకి నువ్వు మాట సాయం చెయ్యి. నేను నీకు అభయం ఇస్తున్నాను, అలా చేస్తే నీ కాలిపోయిన రెక్కలు మళ్ళి వస్తాయి. నాకు కూడా రామలక్ష్మణులను చూడాలని ఉంది, కాని అంతకాలం ఈ శరీరంలో ఉండాలని నాకు లేదు, ఈ శరీరాన్ని విడిచిపెట్టేద్దాము అనుకుంటున్నాను. నువ్వు మాత్రం ఈ కొండమీదే వేచి ఉండు. నీకు ఇంకొక విషయం చెబుతాను, సీతమ్మని అపహరించిన తరువాత ఆమెని వశం చేసుకుందామని రావణాసురుడు తన అంతఃపురం చూపిస్తాడు, దివ్యమైన భోజనము పెడతాడు. కాని ఆ తల్లి కన్నెత్తి కూడా చూడదు, ఒక మెతుకు ముట్టదు. ఆ తల్లికోసం దేవేంద్రుడు ప్రతి రోజూ దేవతలు కూడా చూడనటువంటి దివ్యమైన పాయసాన్ని పంపిస్తాడు. కాని సీతమ్మ ఆ పాయసాన్ని తినదు. ఆమె, పైన ఉన్న పాయసాన్ని తీసి ఈ భూమండలంలో ఎక్కడైనా సరే రామలక్ష్మణులు బతికుంటే, ఈ పాయసం వారికి చెందుగాక, ఒకవేళ రామలక్ష్మణులు శరీరాలని విడిచిపెట్టి ఉంటె, ఉర్ధలోకములలో ఉన్నవాళ్ళకి ఈ పాయసం చెందుగాక, అని భూమి మీద పైన ఉన్న పాయసాన్ని పెడుతుంది. ఆ సీతమ్మ తిన్న అన్నం రావణుడు పెట్టినది కాదు. ఈ విషయాన్ని ఆ వానరులు వచ్చాక వాళ్ళకి చెప్పు' అని ఆనాడు నిశాకర మహర్షి నాకు చెప్పారు. అందుకని కొన్ని వేల సంవత్సరముల నుండి ఇలా బతికి ఉన్నాను. 

తస్య తు ఏవం బ్రువాణస్య సంహతైః వానరైః సహ ||
ఉత్పేతతుః తదా పక్షౌ సమక్షం వన చారిణాం ||

సంపాతి ఈ మాటలని వానరాలకి చెప్పగానే కాలిపోయిన ఆయన రెక్కలు మళ్ళి పుట్టాయి. అప్పుడాయన తన ఎర్రటి రెక్కలని అటూ ఇటూ ఊపి చూసుకున్నాడు. ఆనందంతో ఆ సంపాతి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. 

ఇంక అక్కడున్న వానరాలకి ఇది చూడగానే చాలా సంతోషంవేసింది. సముద్రాన్ని దాటుదామని వాళ్ళందరూ కలిసి సముద్రం యొక్క ఉత్తర తీరానికి చేరుకున్నారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు "ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకి వెళ్ళగలిగినవాడు ఎవడు. మిగిలిన వానర జాతికి ఎవడు ప్రాణప్రదానం చెయ్యగలిగినవాడు. ఈ సముద్రం దెగ్గర నిలబడిపోయిన వానరాలు సంతోషంగా తిరిగి వెళ్ళి తమ భార్యాపిల్లలని చూసేటట్టు చెయ్యగలిగినవాడు ఎవడు. ఎవరివల్ల ఈ కార్యం జెరుగుతుంది, ఎవరు అంతటి సమర్ధుడు" అని అడిగారు.  

అప్పుడు శరభుడు లేచి, నేను 30 యోజనములు వెళతాను అన్నాడు, అలాగే ఋషభుడు 40 యోజనములు వెళతాను అన్నాడు, గంధమాదనుడు 50, మైందుడు 60, ద్వివిదుడు 70, సుషేణుడు 80. అప్పుడు జాంబవంతుడు లేచి అన్నాడు "నేను యవ్వనంలో ఉన్నప్పుడు చాలా బలంగా ఉండేవాడిని. పరమేశ్వరుడు త్రివిక్రమావతారంతో(వామన) పెరిగిపోతుంటే నేను ఆయనకి 21 సార్లు ప్రదక్షిణ చేశాను. కాని ఇప్పుడు నేను ముసలివాడిని అయిపోయాను, నేను ఇప్పుడు 90 యోజనాలు ఎగరగలను" అన్నాడు. 

అప్పుడు అంగదుడు అన్నాడు "నేను 100 యోజనాలు వెళ్ళగలను, కాని తిరిగి మళ్ళి ఈ 100 యోజనాలు రాలేను" అన్నాడు. 

అప్పుడు జాంబవంతుడు "అయ్యో, అది మహా పాపం. ప్రభువు వెళ్ళి పని చేస్తుంటే, ఆయనని సేవించేవారు హాయిగా కూర్చుంటే అది చాలా అసహ్యంగా ఉంటుంది. నువ్వు వెళ్ళకూడదు, నువ్వు మాకు పనిని పురమాయించాలి. ఎవరిని పంపాలో నాకు తెలుసు, వాడిని నేను పంపిస్తాను, మీరందరూ చూడండి" అని ఒక్కడిగా కూర్చున్న హనుమంతుడి దెగ్గరికి వెళ్ళి "ఏమయ్యా హనుమా! ఏమి తెలియని వాడిలా ఇలా కూర్చున్నావు. ఒకానొకప్పుడు అప్సరసలలో శ్రేష్టురాలైన పుంజికస్థల అనబడే ఒక అప్సరస శాపవశం చేత కుంజరుడు అనే వానరానికి కుమార్తెగా జన్మించింది. ఆమెకి అంజనా అని పేరు పెట్టారు. ఆమె నీ తండ్రి అయిన కేసరి యొక్క భార్య. నీ తల్లి కామరూపి అవడంచేత ఒకనాడు మనుష్య రూపం దాల్చి ఒక పర్వత శిఖరం మీద నిలబడింది. వాయువు ఆమెని చూసి మోహించి, తన దీర్ఘమైన బాహువుల చేత గట్టిగా కౌగలించుకున్నాడు. అప్పుడా తల్లి 'ఎవడురా దుర్మార్గుడు నా పాతివ్రత్యాన్ని చెరప చూస్తున్నవాడు' అనింది. అప్పుడా వాయువు అన్నాడు 'అమ్మా! బ్రహ్మగారు మా తేజస్సులని వానర స్త్రీలయందు ప్రవేశపెట్టి వానరాలని సృష్టించామన్నారు. అందుకని నీ పాతివ్రత్యానికి భంగం కలగకుండా గొప్ప పరాక్రమము ఉన్నవాడు, బుద్ధిమంతుడు, నాతో సమానంగా దూకగలిగినవాడు, ఎగరగలిగినవాడైన పుత్రుడు కేవలం నిన్ను నేను మానసికముగా చూసినంత మాత్రాన నీ కడుపుయందు జన్మించనున్నాడు' అన్నాడు. ఆ కారణం చేత నువ్వు జన్మించావు. 

నువ్వు పుట్టగానే ఆకాశంలో ఉన్న సూర్యుడిని చూసి తినే ఫలం అనుకొని ఆయనని పట్టుకోబోయావు. సూర్య పధానికి అడ్డు వస్తున్నావని కోపమొచ్చి ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొడితే, నీ ఎడమ దవడ చొట్టపడి కింద పడ్డావు. సొట్టపడ్డ హనుములు కలిగినవాడివి కనుక నిన్ను హనుమ అని పిలిచారు. నువ్వు అలా పడిపోవడం చేత నీ తండ్రి అయిన వాయుదేవుడికి కోపం వచ్చి భూమిమీద వీచడం మానేశాడు. అప్పుడు బ్రహ్మగారు పరుగు పరుగున వచ్చి, గాలి వీచకపోతే సృష్టి ఆగిపోతుందని "హనుమా! ఏ అస్త్రము చేత, ఏ శస్త్రము చేత నిన్ను ఎవరూ బంధించలేరు" అని వరం ఇచ్చారు. అలాగే ఇంద్రుడు నీకు స్వచ్ఛంద మరణ వరం ఇచ్చాడు. నీ అంత నువ్వు సంకల్పం చేసి శరీరాన్ని విడిచిపెట్టాలి కాని, నిన్ను పడగొట్టగలిగే పురుషుడు ఈ బ్రహ్మాండంలో ఎక్కడా ఉండడు. 


నేను ఎన్నో సందర్భాలలో సముద్రంలో ఉన్న పాముల్ని గరుగ్మంతుడు తన్నుకుపోతుండగా చూశాను. నీ తండ్రి అయిన వాయుదేవుడు ప్రభంజనుడై వీస్తే పెద్ద పెద్ద చెట్ల యొక్క కొమ్మలని విరిచేస్తాడు. అటువంటి శక్తిమంతుడైన వాయుదేవుడి కుమారుడవైన నీకు ఆ గమన శక్తి ఉంది, గరుగ్మంతుడికి ఆ గమన శక్తి ఉంది. ఇవ్వాళ కొన్ని కోట్ల వానరముల భవిత, సౌభాగ్యము, ప్రాణములు నీ చేతులలో ఉన్నాయి. నీ వీర్యమును, తేజస్సును, పరాక్రమమును ఒక్కసారి పుంజుకో. 100 యోజనముల సముద్రాన్ని అవలీలగా దాటి సీతమ్మ జాడ కనిపెట్టి ఇక్కడికి రా. హనుమా! నీ శక్తిని చూపించు" అని జాంబవంతుడు అన్నాడు. 

జాంబవంతుడి మాటలు విన్న హనుమంతుడు మేరు పర్వతం పెరిగినట్టు తన శరీరాన్ని పెంచేశాడు. గుహలో నుండి సింహం ఆవలిస్తూ బయటకి వస్తుంటే దానిని చూసిన ప్రాణులు భయంతో ఎలా నిలబడిపోతాయో, అలా అప్పటివరకూ తమతో తిరిగిన హనుమంతుడు అటువంటి స్వరూపాన్ని పొంది, ఒక్కసారి ఆవలించి, బాహువులని పైకి ఎత్తి ఒక్కసారి విదిల్చి భూమి మీద కొట్టేసరికి వానరములన్నీ భయపడిపోతూ, శ్రీమహా విష్ణువు దర్శనం అయితే ఎలా నిలబడతారో అలా హనుమంతుడిని చూసి అంజలి ఘటించి నిలబడిపోయారు. 

అప్పుడు హనుమంతుడు అక్కడ ఉన్న వృద్ధులైన వానరాలకి నమస్కరించి "నా తండ్రి వాయుదేవుడు, ఆయన అగ్నిదేవుడి యొక్క సఖుడు. వాయుదేవుడు ఎటువంటి గమనంతో వెళతాడో నేను అటువంటి గమనంతో వెళతాను. నేను వెళుతున్నప్పుడు నాకు అడ్డొచ్చిన ఏ ప్రాణినైనా నా వక్షస్థలంతో గుద్ది చంపేస్తాను. పర్వతాలని చూర్ణం చేస్తాను, సముద్రాల్ని కలయ తిప్పుతాను. నా బాహువుల శక్తి చేత ఈ సముద్రాన్ని తిరగ తోడుతాను. 100 యోజనములే కాదు 10,000 యోజనములైనా సరే కొన్ని వేల మార్లు అటువైపు నుండి ఇటువైపుకి వెళతాను. సూర్యుడు ఉదయిస్తుండగా భూమి నుండి ఆకాశంలోకి వెళతాను, సూర్యుడి సమీపంలో నిలబడి నమస్కారం చేస్తాను. సూర్యుడు అస్తమించడానికి పశ్చిమ దిక్కుకి వెళుతుంటే ఆయన దెగ్గరికి వెళ్ళి మళ్ళి నమస్కరించి వస్తాను. గరుగ్మంతుడు సముద్రం మీద తిరుగుతుండగా ఆయనకి కొన్ని వేలసార్లు ప్రదక్షిణం చేస్తాను. ఇక్కడ నుండి లేచి దక్షిణ దిక్కున ఉన్న సముద్రాన్ని ముట్టుకుంటాను. రావణాసురుడిని కొట్టి చంపేస్తాను, లేదా లంకని ఫెల్లఘించి చేతితో పట్టి సముద్రానికి ఈవలి ఒడ్డుకి తీసుకువచ్చి రాముడి పాదాల దెగ్గర పడేస్తాను. ఇక నా పరాక్రమము ముందు నిలబడగలిగినవాడు లేడు. బ్రహ్మగారు, దేవేంద్రుడు చెరొక ఆసనం మీద కుర్చూని మధ్య ఆసనంలో అమృతాన్ని పెడితే, ఇద్దరి మధ్యలోకి వెళ్ళి, చెరొక చేతితో ఇద్దరినీ అడ్డగించి అమృతాన్ని తీసుకురాగలను. ఈ భూమి నన్ను తట్టుకోలేకపోతుంది, అందుకని మహేంద్రగిరి పర్వతం మీద నుంచి బయలుదేరతాను" అన్నాడు.

అలా హనుమంతుడు ఆ మహేంద్రగిరి పర్వతాన్ని ఎక్కుతుంటే, అక్కడున్న గంధర్వులు, విద్యాధరులు ఎగిరి పారిపోయారు. అనిల కుమారుడి పద ఘట్టనకి ఆ పర్వతం కంపించిపోయింది, చెట్లు నేలరాలిపోయాయి, మృగములన్నీ దిక్కులు పట్టి పారిపోయాయి. హనుమంతుడిని చూసిన వానరాలు "మహానుభావ! ఋషుల యొక్క ఆశీర్వచనము చేత, గురువుల యొక్క ఆశీర్వచనము చేత, దేవతల యొక్క ప్రభావము చేత ఏ విధమైన ప్రతిబంధకము లేకుండా 100 యోజనముల సముద్రాన్ని దాటి సీతమ్మ జాడ కనిపెట్టి తిరిగి నువ్వు ఎప్పుడు వస్తావ అని ఒంటి పాదం మీద నిలబడి ఉంటాము. ఇన్ని కోట్ల వానరాలకి ప్రాణము పెట్టిన వాడిగా కీర్తి గడించెదవుగాక. నీకోసం పుణ్య కర్మలను చేస్తూ ఇక్కడ నిలబడి ఉంటాము" అన్నారు. 

హనుమంతుడు మానసిక ఉత్సాహమును పొంది లంకా పట్టణాన్ని మనస్సుతో చేరిపోయి ఉన్నాడు. 

Tuesday, 22 September 2015

కిష్కింధకాండ - 27

అప్పుడు తార "లక్ష్మణా! ఎందుకయ్యా అంత కోపంగా ఉన్నావు. నీకు ఇంత కోపం తెప్పించడానికి సాహసించిన వాళ్ళు ఎవరు. ఎండిపోయిన చెట్లతో కూడిన వనాన్ని దావాగ్ని దహించేస్తుంటే, దానికి ఎదురు వెళ్ళగల మొనగాడు ఎవడయ్యా" అనింది.

అప్పుడు లక్ష్మణుడు "నీ భర్త యొక్క ప్రవర్తన ఆయన భార్యవైన నీకు తెలియడం లేదా. నీ భర్త ధర్మాన్ని పక్కన పెట్టేసి కేవలం కామమునందే కాలాన్ని గడుపుతున్నాడు. (మనకి ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు అని 4 పురుషార్ధాలు ఉంటాయి. ధర్మబద్ధమైన అర్ధము {కష్టపడి సంపాదించినది}, ధర్మబద్ధమైన కామము {కేవలం తన భార్య అందే కామసుఖాన్ని అనుభవించడం} వలన మోక్షం వైపు అడుగులు వేస్తాము. ధర్మాన్ని పక్కన పెట్టి మనం ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని సుఖాలు అనుభవించినా ప్రమాదమే వస్తుంది). మిత్రుడికి ఇచ్చిన మాట తప్పాడు. 4 నెలల సమయం గడిచిపోయింది. రాజన్నవాడు అనుభవించాల్సింది కేవలం కామము ఒక్కటే కాదు. రాజు మొట్టమొదట మంత్రి పరిషత్తుతో కూడి సమాలోచన చేసి రాజ్యకార్య నిర్వహణ చెయ్యాలి. ఇవన్నీ నీ భర్త చేస్తున్నాడా?. వర్షాకాలంలో వెతకడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ నాలుగు నెలలు సుఖములను అనుభవించి నాలుగు నెలల తరువాత స్నేహితుడికి ఇచ్చిన మాట ప్రకారం సహాయం చెయ్యమంటే, ఇచ్చిన సమయం గడిచిపోయినా ఇంకా కామసుఖాలని అనుభవిస్తూ ఉన్న సుగ్రీవుడిది దోషం కాదా?. ఇవ్వాళ నీ భర్త నిరంతర మధ్యపానం చేస్తుండడంవలన ఆయన బుద్ధియందు వైక్లవ్యం ఏర్పడింది. అందుచేత ఆ మధ్యపానమునందు రమిస్తున్న సుగ్రీవుడు పురుషార్ధములయందు చెడిపోయాడు" అన్నాడు. 

అప్పుడు తార "నాయనా! ఇది కోపగించవలసిన కాలం కాదయ్యా. ఎవరో బయటివాళ్ళు చెడిపోతే నువ్వు కోపంతో గట్టిగా కేకలు వెయ్యచ్చు, నిగ్రహించచ్చు, చంపచ్చు. కాని ఇవ్వాళ నీ అన్నతో సమానమైన సుగ్రీవుడు కామానికి బానిస అయ్యాడు. అటువంటి సుగ్రీవుడి మీద నీకు ఇంత కోపం తగదయ్యా. 'సుగ్రీవుడిది దోషము' అని నువ్వు చెప్పినది పరమ యదార్ధము. నువ్వు గుణములు ఉన్నవాడివి కనుక సుగ్రీవుడిని క్షమించవయ్య. లక్ష్మణా! నువ్వు చాలా గుణాలు ఉన్నవాడివి, అందుకే నీకు ఇంత శాస్త్ర మర్యాద తెలుసు. నా భర్త చాలా అల్పమైన గుణములు ఉన్నవాడు, అందుకని కామమునకు లొంగిపోయాడు. మరి నువ్వు కోపమునకు లొంగిపోతున్నావేమయ్యా?

లక్ష్మణా! నువ్వు ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి అరుస్తున్నావు కాని, రాముడు బాణం వేస్తే ఆ ప్రభావం ఎలా వుంటుందో నాకు తెలుసు, సుగ్రీవుడు ఎంత విలువైన కాలాన్ని చేజార్చుకున్నాడో నాకు తెలుసు, దానివల్ల రాముడు ఎంత బాధపడుతున్నాడో నాకు తెలుసు. ఈ మూడు తప్పులు జెరిగాయి కనుక మీకు ఉపకారం ఎలా చెయ్యాలో కూడా నాకు తెలుసు. మన్మధుడి బాణాలు ఎంత తీవ్రంగా ఉంటాయో, ఆ బాణాల దెబ్బకి కామానికి ఎంత తొందరగా పడిపోతారో నాకు తెలుసు. ఏ కాముని బాణాల దెబ్బకి సుగ్రీవుడు ఇలా ఉన్నాడో నాకు తెలుసు, ఆ సుగ్రీవుడు ఎవరి పొందుయందు సంతోషంగా ఉన్నాడో నాకు తెలుసు. శత్రువులని చంపే ఓ లక్ష్మణా! ఇవ్వాళ సుగ్రీవుడు తన ఇంద్రియాలకి లొంగిపోయాడు. అంతేకాని ఆయనకి రాముడి మీద ఎటువంటి ద్వేషభావము లేదు, అందుకని నువ్వు ఆయనని క్షమించి తీరాలి. 

ఏమయ్యా లక్ష్మణా, నేను కొత్తగా చెప్పాల, నీకు తెలీదా, సంసారాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి తపస్సు చేసుకునే మహర్షులు ఇంద్రుడు పంపిన అప్సరసలని చూసి కామానికి లొంగి తమ తపస్సులను భ్రష్టు పట్టించుకున్నవారు చాలామంది ఉన్నారు. అంత గొప్ప మహర్షులే కామానికి లొంగిపోయినప్పుడు, చపలబుద్ధి కలిగిన వానరుడు కామంతో చెయ్యవలసిన పనిని కొన్ని రోజులు మరిచిపోవడం పెద్ద విషయమా. సుగ్రీవుడు ఇంతగా కామానికి లొంగిపోయినప్పటికీ కూడా, మీకు ఇచ్చిన మాటని నెరవేర్చడానికి ఎప్పుడో ప్రయత్నాలు ప్రారంభించాడు. లక్ష్మణా! ఇక్కడే నిలబడి ఉన్నావు, నువ్వు అంతఃపురంలోకి రాకూడదా, నువ్వేమన్నా పరాయివాడివా. సుగ్రీవుడు పడుకున్న మందిరంలోకి వస్తే అంతఃపుర కాంతలు కనిపిస్తారని సందేహిస్తున్నావా. మిత్రుడైన వాడు, అన్యభావన లేకుండా మిత్రుడితో మాట్లాడేవాడు, చారిత్రం ఉన్నవాడు, నడువడి ఉన్నవాడు అంతఃపురంలోకి రావచ్చయ్యా. ఏమి దోషంలేదు, లోపలికి రా" అనింది. 

బంగారు కన్నుతో మెరిసిపోతున్న సుగ్రీవుడు, తన తొడ మీద రుమని కూర్చోపెట్టుకొని గట్టిగా కౌగలించుకొని ఉన్నాడు. తెర తీసుకొని లక్ష్మణుడు లోపలికి రాగానే సుగ్రీవుడికి తన దోషం జ్ఞాపకం వచ్చి గబ్బుక్కున ఎగిరి లక్ష్మణుడి దెగ్గర వాలి, శిరస్సు వంచి అంజలి ఘటించాడు.

కాని సుగ్రీవుడి చూడగానే లక్ష్మణుడికి కోపం వచ్చి "సుగ్రీవా! రాజన్నవాడు ఉత్తమమైన అభిజనంతో కూడి ఉండాలి, జాలికలిగినవాడై ఉండాలి, ఇంద్రియములను గెలిచినవాడై ఉండాలి, చేసిన ఉపకారాన్ని మరిచిపోనివాడై ఉండాలి, మాట తప్పనివాడై ఉండాలి. అటువంటివాడిని ఈలోకం రాజని గౌరవిస్తుంది. మిత్రుడి దెగ్గర సహాయం పొంది, ఆ మిత్రుడికి తిరిగి ఉపకారం చెయ్యనివాడిని ఈ లోకం క్రూరుడు అని పిలుస్తుంది. 

ఎవడైనా గుర్రం విషయంలో అసత్యం చెబితే (అంటె ఎవరికన్నా గుర్రం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉండడం), నూరు గుర్రాలని చంపిన పాపం వస్తుంది. ఆవు విషయంలో అసత్యం చెబితే, వెయ్యి ఆవుల్ని చంపిన పాపం వస్తుంది. అలాగే, ఉపకారం చేస్తానని చెప్పి ఆ మాటకి కట్టుబడనివాడు తన బందువులందరిని చంపి, వారిని తినేసి, తననితాను చంపుకున్నవాడితో సమానమవుతాడయ్య సుగ్రీవా. ఒకరిదెగ్గరికి వెళ్ళి ' అయ్యా మీరు నాకు ఉపకారం చెయ్యండి, నేను మీకు ప్రత్యుపకారం చేస్తాను ' అని మాట పుచ్చుకొని, వారి దెగ్గరినుండి ఉపకారం పొందేసి, దాని ఫలితాన్ని అనుభవిస్తూ, తాను ఇచ్చిన మాట మరిచిపోయినవాడిని లోకం అంతా కలిసి చంపేస్తుంది. బ్రహ్మహత్య చేసినవాడికి, మధ్యపానం చేసినవాడికి, దొంగతనం చేసినవాడికి, ఒక వ్రతం చేస్తాను అని చెయ్యడం మానేసినవాడికి ప్రాయశ్చిత్తం ఉండచ్చు, కాని క్రుతఘ్నుడికి ప్రాయశ్చిత్తం లేదు. నువ్వు రాముడికి ఉపకార్తం చేస్తానని ఒప్పుకున్నావు, కాని ప్రత్యుపకారం చెయ్యలేదు. నీ ప్రవర్తన చూసి మా అన్నయ్య నిన్ను మంచివాడు అనుకున్నాడు, కాని నువ్వు కప్పలా అరుస్తున్న పామువని మా అన్నయ్య కనిపెట్టలేకపోయాడయ్యా. నువ్వు మా అన్నయ్యకి చేసిన దోషానికి నిన్ను ఇప్పుడే చంపేస్తాను. నీ మాట మీద నువ్వు నిలబడు, లేకపోతె వాలి వెళ్ళిన దారిలో వెళ్ళిపోవలసి ఉంటుంది" అని లక్ష్మణుడు అన్నాడు. 

లక్ష్మణుడు మాట్లాడుతున్నంతసేపు నక్షత్రముల మధ్యలో ఉన్న చంద్రుడిలా సుగ్రీవుడు తన భార్యల మధ్యలో చేతులుకట్టుకొని నిలబడిపోయి ఉన్నాడు.

అప్పుడు తార "లక్ష్మణా! నీ నోటి వెంట సుగ్రీవుడి గురించి ఇటువంటి మాటలు రాకూడదు. సుగ్రీవుడు కుటిలుడు కాదు, అసత్యవాది కాదు, ఇంద్రియనిగ్రహం లేనివాడు కాదు, శఠుడు కాదు. రాముడు చేసిన ఉపకారాన్ని సుగ్రీవుడు ఎన్నడూ మరిచిపోలేదు. రాముడు చేసిన ఉపకారం వల్లనే సుగ్రీవుడు ఈనాడు ఇంత గొప్ప రాజ్యాన్ని, ఐశ్వర్యాన్ని, రుమని, నన్ను పొందగలిగాడు. చాలా కాలం సుఖాలకి దూరంగా ఉండడం వలన సుగ్రీవుడు ఈనాడు సమయాన్ని మరిచిపోయాడు. ఏమయ్యా, నా భర్తేన అలా మరిచిపోయినవాడు? విశ్వామిత్రుడంతటివాడు కూడా కామానికి లొంగి సమయాన్ని మరిచిపోయాడు కదా. ఏ రుమయందు, ఏ రాజ్యమునందు, నా యందు ఆనందముతో సుగ్రీవుడు ఈనాడు సమయాన్ని మరిచిపోయాడో, అదే సుగ్రీవుడు రామకార్యం కోసం అవసరమైతే నన్ను, రుమని, రాజ్యాన్ని వదిలేస్తాడు. రావణుడు యుద్ధంలో నిహతుడవుతాడు. చంద్రుడితో రోహిణి కలిసినట్టు, కొద్దికాలంలోనే సీతమ్మ రాముడితో కలవడం సుగ్రీవుడు చూస్తాడు.

శత కోటి సహస్రాణి లంకాయాం కిల రక్షసాం |
అయుతాని చ షట్ త్రింశత్ సహస్రాణి శతాని చ ||

నాయనా! లంకలో నూరు వేల కోట్ల రాక్షసులు(1 ట్రిలియన్), మరియు 36 వేల సంఖ్యలో(ఒక్కొక్క సంఖ్యలో 100 మంది సైనికులు) బలగాలు ఉన్నాయి. వాలి బతికి ఉన్నప్పుడు ఈ విషయాలని నాకు చెప్పాడు, కాని నాకు పూర్తిగా తెలియదు. అంతమంది రాక్షసులని మట్టుపెట్టడానికి మనకి కూడా కొన్ని కోట్ల కోట్ల వానర సైన్యం అవసరముంది. అందుకని సుగ్రీవుడు వానర సైన్యం కోసం కబురుపెట్టాడు. నువ్వు పద్దాక బాణ ప్రయోగం చేస్తాను అంటుంటే, ఆనాడు రాముడి బాణానికి వాలి పడిపోయిన సంఘటన గుర్తుకువచ్చి ఇక్కడున్నటువంటి స్త్రీలందరూ భయపడుతున్నారు. నువ్వు ఇలా ప్రవర్తించకూడదు, నీ కోపాన్ని విడిచిపెట్టు" అనింది. 

అప్పుడు లక్ష్మణుడు "అమ్మా! నువ్వు చెప్పిన మాట యదార్ధమే, నేను అంగీకరిస్తున్నాను. ఇక నేను కోపంగా మాట్లాడను, నేను ప్రసన్నుడను అయ్యాను" అన్నాడు. 

లక్ష్మణుడి మాటలు విన్న సుగ్రీవుడు ఆనందంతో తన మెడలో ఉన్న పుష్పహారాలని పీకేసి "లక్ష్మణా! నేను రాజ్యాన్ని, భార్యని పోగొట్టుకున్నాను. మళ్ళి రాముడి అనుగ్రహంతో వాటిని పొందాను. కేవలం తన చూపు చేత, బాణ ప్రయోగం చేత రాముడు లంకని కాల్చేయగలడు, అటువంటి రాముడికి సహాయం చెయ్యడానికి నేను ఎంతటి వాడిని. 'నా రాముడే కదా' అని ప్రేమ చేత కాలాన్ని మరిచిపోయానో, లేకపోతె 'వానర సైన్యానికి కబురు పంపించాను కదా' అన్న విశ్వాసంతో మరిచిపోయానో, నేను కాలాన్ని మరిచిపోయిన మాట యదార్ధమే లక్ష్మణా. ప్రపంచంలో పొరపాటు చెయ్యనివాడు అంటూ ఉండడు కదా, అందుకని నన్ను క్షమించు" అన్నాడు. 

అప్పుడు లక్ష్మణుడు "నువ్వు మా అన్నయ్యకి నాథుడిగా ఉన్నావు. నీవంటి వాడి నీడలో ఉన్న రాముడి పని జెరిగి తీరుతుంది. అపారమైన శక్తి ఉండికూడా, తిరగబడకుండా, తప్పు జెరిగితే ఇలా చేతులు కట్టుకొని క్షమించమని అడగగలిగే ధార్మికమైన బుద్ధి మా అన్న రాముడి దెగ్గర ఉంది, సుగ్రీవ నీ దెగ్గర ఉంది. ఆ ప్రస్రవణ పర్వత గుహలో బాధపడుతున్న నీ స్నేహితుడిని ఓదార్చు. మా అన్నయ్య బాధాపడుతున్నాడన్న బాధతో కోపానికి లొంగి నిన్ను అనకూడని మాటలు ఏమైనా నేను అని ఉంటె, సుగ్రీవా! నన్ను క్షమించు" అన్నాడు. 

తరువాత సుగ్రీవుడు హనుమంతుడిని పిలిచి "ఈ భూమండలంలో ఎక్కడెక్కడ ఉన్న వానరాలు ఇక్కడికి రావాలని చెప్పాను. వాళ్ళని కేవలం 10 రోజులలో రమ్మని చెప్పండి. మలయ, హిమాలయ, మహేంద్ర, వింధ్య మొదలైన పర్వతాల మీద ఉన్నవాళ్లు ఇక్కడికి వచ్చెయ్యాలి. కాటుక రంగులో ఉన్నవారు, బంగారు రంగులో ఉన్నవారు, వెయ్యి ఏనుగుల బలం కలిగినవారు, పది ఏనుగుల బలం కలిగినవారు, నీటిమీద నడిచేవారు, నీళ్ళల్లో ఉండేవారు, పర్వతాల మీద ఉండేవారు, చెట్ల మీద ఉండేవారు మొదలైన వానరాలన్నిటికి కబురు చెయ్యండి" అని చెప్పాడు. 

సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం మంత్రులు మొదలైనవారు వానరాలని తీసుకురావడానికి వెళ్ళారు. అలా వెళ్ళినవారు అన్ని ప్రాంతాలలోని వానరాలని కూడగట్టుకొని కిష్కిందకి పయనమయ్యారు. 

తరువాత సుగ్రీవుడు పల్లకిలో తనతోపాటు లక్ష్మణుడిని ఎక్కించుకొని ప్రస్రవణ పర్వతానికి చేరుకున్నాడు. ఇంతకాలానికి ప్రభువు బయటకి వచ్చాడని అక్కడున్న వానరాలు కూడా బయటకి వచ్చాయి. అప్పుడాయన రాముడి దెగ్గరికి వెళ్ళి, తన శిరస్సు రాముడి పాదాలకి తగిలేటట్టు పాదాభివందనం చేశాడు. అప్పుడు రాముడు సుగ్రీవుడిని కౌగలించుకొని "ధర్మము, అర్థము, కామము వీటికోసం కాలాన్ని విడదీసుకోవడంలోనే ఎవరిదైనా ప్రాజ్ఞత ఉందయ్యా. కేవలం కామమునందే జీవితాన్ని నిక్షిప్తం చేసుకున్నవాడు, చెట్టు చివ్వరి కొమ్మమీద నిద్రపోతున్నవాడితో సమానం" అన్నాడు. 

అప్పుడు సుగ్రీవుడు "రామ! నువ్వు ఇచ్చినదే ఈ రాజ్యం, ఈ భార్య, కాని నేను కృతఘ్నుడను కానయ్యా. కొన్ని కోట్ల వానరాలు, భల్లూకాలు మొదలైనవి వచ్చేస్తున్నాయి. వీటన్నిటితో ఏ కార్యము చెయ్యాలో నన్ను శాసించు" అన్నాడు. 

రాముడన్నాడు "నీవంటి మిత్రుడు దొరకడం నా అదృష్టం సుగ్రీవ. సీత ఈ భూమండలం మీద ఎక్కడ ఉంది? ప్రాణములతో ఉన్నదా, ప్రాణములు తీయబడినదా. అసలు ఏ పరిస్థితులలో ఉన్నదో అన్న జాడ ముందు కనిపెట్టాలి. అందుకోసం వానరాలని అన్నిదిక్కులకి పంపించి అన్వేషణ జెరిగేటట్టు చూడు" అన్నాడు. 

ఇంతలో అక్కడికి కోట్ల కోట్ల వానరములు వచ్చాయి. అవి రావడం వలన ఆ ప్రాంతమంతా దుమ్ము, ధూళితో నిండిపోయింది. అంతా గోలగోలగా ఉంది. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు, కొంతమంది నమస్కారాలు చేస్తున్నారు, కొంతమంది చెట్లమీద ఉన్నారు, కొంతమంది నీళల్లో ఉన్నారు, కొంతమంది పర్వతాలమీద ఉన్నారు. 

అప్పుడు వానర రాజైన సుగ్రీవుడు అందరినీ సరిగ్గా నిలబడమన్నాడు. అప్పుడా వానరాలు తమని ఎవరెవరు తీసుకొచ్చారో వాళ్ళ దెగ్గరికి వెళ్ళి నిలబడ్డాయి. "ఎవరు ఎంతమందిని తెచ్చారో నాకు చెప్పండి" అని సుగ్రీవుడు ఆదేశించాడు. 


అప్పుడు వాళ్ళు అన్నారు "సూర్యాస్తమయ పర్వతం నుండి 10 కోట్ల వానరాలు వచ్చాయి, శతబలి అనే వానరుడు 10 వేల కోట్ల వానరములతో వచ్చాడు. సుషేణుడు లెక్కపెట్టలేనన్ని వానరాలతో వచ్చాడు. రుమ తండ్రి కొన్ని వేల కోట్ల వానరాలతో వచ్చాడు. హనుమంతుడి తండ్రి అయిన కేసరి కొన్ని వేల కోట్ల వానరములతో వచ్చాడు. గవాక్షుడు 1000 కోట్ల కొండముచ్చులతో వచ్చాడు. ధూమ్రుడు 2000 కోట్ల భల్లూకములతో వచ్చాడు, పనసుడు 3 కోట్ల వానరాలతో వచ్చాడు, నీలుడు 10 కోట్ల నల్లటి దేహం కలిగిన వానరాలతో వచ్చాడు, గవయుడు 5 కోట్ల వానరాలతో వచ్చాడు, దరీముఖుడు 1000 కోట్ల వానరాలతో వచ్చాడు, మైంద-ద్వివిదులు అశ్విని దేవతల్లా 1000 కోట్ల వానరాలని తెచ్చారు, గజుడు 3 కోట్ల వానరాలని తెచ్చాడు, జాంబవంతుడు 10 కోట్ల భల్లూకాలని తెచ్చాడు, రుమణుడు 100 కోట్ల వానరాలని తెచ్చాడు, గంధమాదనుడు 10 వేల కోట్ల వానరములతో వచ్చాడు, ఆయన వెనకాల లక్ష కోట్ల వానరాలు వస్తున్నాయి, అంగదుడు 1000 పద్మ వానరాలని, 100 శంకు వానరాలని తీసుకొచ్చాడు, తారుడు 5 కోట్ల వానరాలని తీసుకొచ్చాడు, ఇంద్రజానువు 11 కోట్ల వానరాలని తెచ్చాడు, రంభుడు 1100 ఆయుత వానరాలని తెచ్చాడు, దుర్ముఖుడు 2 కోట్ల వానరాలని తెచ్చాడు, హనుమంతుడు కైలాశ శిఖరాల్లా ఎత్తుగావున్న 1000 కోట్ల వానరాలని తెచ్చాడు, నలుడు 100 కోట్ల 1000 మంది 100 వానరాలతో వచ్చాడు, దధిముఖుడు 10 కోట్ల వానరాలతో వచ్చాడు.

10,000 కోట్లయితే ఒక ఆయుతం, లక్ష కోట్లయితే ఒక సంకువు, 1000 సంకువులయితే ఒక అద్భుదం, 10 అద్భుదములయితే ఒక మధ్యం, 10 మధ్యములయితే ఒక అంత్యం, 20 అంత్యములయితే ఒక సముద్రం, 30 సముద్రములయితే ఒక పరార్థం, అలాంటి పరార్థాలు కొన్ని వేలు ఉన్నాయి ఇక్కడ" అని అన్నారు. 

అప్పుడు సుగ్రీవుడు వినతుడు అనే వానరాన్ని పిలిచి "వినతా! నువ్వు లక్షమంది వానరాలతో బయలుదేరి తూర్పు దిక్కుకి వెళ్ళు. నీకు నెల రోజుల సమయం ఇస్తున్నాను, నెల రోజులలో సీతమ్మ తల్లి జాడ కనిపెట్టాలి. మీరు ఇక్కడినుండి తూర్పు దిక్కుకి బయలుదేరి గంగ, సరయు, కౌశికి, యమున, సరస్వతి, సింధు మొదలైన నదులని, వాటి తీరములలో ఉన్న ప్రాంతాలని అన్వేషించండి. బ్రహ్మమాల, విదేహ, మాలవ, కాశి, కోసల, మాగధ, పుణ్డ్ర, అంగ దేశములలో ఉండే పట్టణాలని, జనపదాలని వెతకండి. వెండి గనులు కలిగిన ప్రదేశాలు అక్కడ ఉన్నాయి, ఆ ప్రదేశాలన్నీ వెతకండి. సముద్రాలలో గల పర్వతాలు, వాటి మధ్యలో గల ద్వీపాలు, అందులో ఉన్న నగరాలు, మందరాచల శిఖరము మీద కలిగినటువంటి గ్రామాలలో నివసిస్తున్న జనుల యొక్క ఇళ్ళు, అక్కడ కొంతమందికి చెవులు ఉండవు, కొంతమందికి పెదవులు చెవుల వరకూ వ్యాపించి ఉంటాయి, కొంతమంది జుట్టు చెవుల వరకూ పడి ఉంటుంది. వాళ్ళందరూ చాలా భయంకరమైన నరభక్షకులు, వాళ్ళు నీళ్ళల్లో ఉంటారు. మీరందరూ ప్రతి చోట సీతమ్మని వెతకండి. అలా కొంతదూరం వెళితే యవద్వీపం కనపడుతుంది, అది రత్నములతో నిండి ఉంటుంది, మీరు అక్కడ వెతకండి. తరువాత సువర్ణ ద్వీపము, రూప్యక ద్వీపము ఉంటాయి. అవి బంగారము, వెండి గనులకు నిలయమైనటువంటివి. అది దాటితే శిశిరం అనే పర్వతం కనపడుతుంది, ఆ పర్వతం అంతా వెతకండి. 

కొంతదూరం వెళ్ళాక శోణానది కనపడుతుంది. ఆ నది చాలా లోతుగా, ఎర్రటి నీటితో ఉంటుంది. ఆ ప్రదేశంలో సిద్ధులు, చారులు విహరిస్తూ ఉంటారు. అక్కడున్న ఆశ్రమాలలో, తపోవనాలలో సీతమ్మని ఉంచాడేమో వెతకండి. తరువాత ఇక్షు సముద్రం వస్తుంది, అందులో మహాకాయులైన అసురులు ఉంటారు. వాళ్ళు ఆకలిని తీర్చుకోడానికి ప్రాణుల నీడని పట్టి బక్షిస్తుంటారు. అది దాటాక లోహితము అనే మధు సముద్ర తీరాన్ని చేరుకుంటారు. అక్కడ బూరుగు వృక్షములు చాలా సంఖ్యలో పెరిగి ఉంటాయి, అందుకని ఆ ద్వీపాన్ని శాల్మలీ ద్వీపం అంటారు. అక్కడున్న గిరి శిఖరాలకి మందేహులు అనే రాక్షసులు తలక్రిందులుగా వేలాడుతూ ఉంటారు. వాళ్ళు సూర్యుడు ఉదయించే సమయంలో, సూర్యుడు ఉదయించకుండా ఆయనని గ్రసించే ప్రయత్నం చేస్తుంటారు. అప్పుడు అక్కడున్న బ్రాహ్మణులు సంధ్యావందనం చేసి అర్ఘ్యం విడిచిపెడితే, ఆ జలముల యొక్క శక్తి చేత, సూర్యుడి శక్తి చేత ఆ మందేహులు అనే రాక్షసులు సముద్రంలో పడిపోతుంటారు. అప్పుడు వాళ్ళు మళ్ళి లేచి ఆ పర్వతానికి తలక్రిందులుగా వేలాడుతూ ఉంటారు. ఆ సముద్ర మధ్యలో ఋషభము అనే పెద్ద పర్వతం ఉంటుంది. ఆ పర్వతం మీద సుదర్శనము అనే పేరుగల గొప్ప సరోవరం వెండి కాంతులతో విరాజిల్లుతూ ఉంటుంది. దానిని దాటితే క్షీర సముద్రం వస్తుంది, దానిని కూడా దాటితే మధుర జలములు కలిగిన మహా సముద్రం వస్తుంది. అందులో ఔర్వుడు అనే మహాముని యొక్క కోపం బడబాగ్నిగా పుట్టి సముద్రంలో ప్రవేశించింది, దానికి హయముఖము అని పేరు. 

దానిని దాటి ముందుకి ఒక 13 యోజనముల దూరం వెళితే ఒక బంగారు పర్వతం కనపడుతుంది. దానికి జాతరూప శిలము అని పేరు. దానిమీద సర్పాకృతి కలిగిన అనంతుడు నల్లటి బట్టలు ధరించి కూర్చొని ఉంటాడు, ఆయనే ఆదిశేషుడు. ఆయన పక్కనే తాటి చెట్టు ఆకారంలో ధ్వజం పెట్టబడి ఉంది. దాని పక్కనే ఒక వేదిక ఉంది, దానిని దేవతలు నిర్మించారు. మీరు ఆ ఆదిశేషుడిని దర్శించి ముందుకి వెళితే బంగారు పర్వతమైన ఉదయాద్రి కనపడుతుంది. ఆ పర్వతం 100 యోజనముల వరకూ విస్తరిస్తూ ఆకాశాన్ని తాకుతూ ఉంటుంది. దానిని దాటి వెళితే సౌమనసం అనే ధృడమైన బంగారు శిఖరము ఉంటుంది. అక్కడే బ్రహ్మగారు భూమండలానికి ద్వారాన్ని ఏర్పాటు చేశారు. అక్కడే సూర్యుడి మొదటి కిరణ ప్రసారం ప్రారంభమవుతుంది. అది దాటి వెళితే కటిక చీకటి. ఇక్కడిదాక అంగుళం విడిచిపెట్టకుండా సీతమ్మ జాడ వెతకండి. కాబట్టి తూర్పు దిక్కుకి వెళ్ళే వానరాలు సిద్ధం కండి" అన్నాడు. 

తరువాత సుగ్రీవుడు "నీలుడు, హనుమంతుడు, జాంబవంతుడు, సుహోత, శరారి, శరగుల్ముడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, మైందుడు, ద్వివిదుడు, గంధమాదనుడు, ఉల్కాముఖుడు, అనంగుడు, హుతాశరుడు మొదలైనవారందరికి నాయకుడిగా యువరాజైన అంగదుడు బయలుదేరి దక్షిణ దిక్కుకి వెళ్ళండి. మీతో పాటు కొన్ని లక్షల వానరాలని తీసుకువెళ్ళండి. వెయ్యి శిఖరములు కలిగిన వింధ్య పర్వతానికి వెళ్ళి ఆ పర్వతం అంతా వెతకండి. గోదావరి నది, కృష్ణవేణి నదిలలో వెతకండి, తరవాత వరదా నదిలో వెతకండి. తరువాత మేఖల దేశము, ఉత్కల దేశము, దశార్ణ నగరము, అబ్రవంతీ, అవంతీ నగరాలని వెతకండి.

నదీం గోదావరీం చైవ సర్వం ఏవ అనుపశ్యత |
తథైవ ఆంధ్రాన్ చ పుణ్డ్రాన్ చ చోలాన్ పాణ్డ్యాన్ కేరలాన్ ||

విదర్భ, ఋష్టిక, మాహి, కళింగ, కౌశిక, ఆంధ్ర, పుణ్డ్ర, చోళ, పాండ్య, కేరళ మొదలైన రాజ్యాలన్నీ వెతకండి. కావేరి నదిని దాటండి. మలయ పర్వత శిఖరం మీద అగస్త్యుడికి విశ్వకర్మ నిర్మించిన గృహం ఉంటుంది, ఆ ప్రాంతాన్ని వెతకండి. తరువాత మొసళ్ళతో ఉన్న తామ్రపర్ణీ నదిలో వెతకండి. ఆ తరువాత సముద్రం వస్తుంది, ఆ సముద్రంలోకి చొచ్చుకుపోయిన శిఖరములతో మహేంద్రగిరి పర్వతం కనపడుతుంది. ఆ సముద్రానికి 100 యోజనముల అవతల ఒక ద్వీపం ఉంది, దానిని కాంచనలంక అంటారు. ఆ లంకా పట్టణాన్ని రావణాసురుడనే పది తలల రాక్షసుడు పరిపాలిస్తున్నాడు. అక్కడ మీరు చాలా జాగ్రత్తగా వెతకాలి. ఆ తరువాత సముద్రాన్ని దాటితే పుష్పితము అనే పర్వతము కనపడుతుంది. అది దాటితే సూర్యవత్, వైద్యుతం అనే పర్వతాలు కనపడతాయి. ఆ పర్వతాల మీద ఉండే చెట్లకి కాచిన పళ్ళు చాలా బాగుంటాయి, అవి తినండి. ఆ తరువాత కుంజరం అనే పర్వతం కనపడుతుంది, దాని మీద విశ్వకర్మ అగస్త్యుడికి బ్రహ్మాండమైన భవనం నిర్మించాడు. అలా ముందుకి వెళితే భోగవతి అనే నగరం వస్తుంది, అందులో విషంతో కూడుకున్న పాములు ఉంటాయి. అక్కడే సర్పాలకి రాజైన వాసుకి ఉంటాడు. ఆ తరువాత ఎద్దు ఆకారంలో ఉన్న వృషభ పర్వతం కనబడుతుంది. దానిమీద గోశీర్షకము, పద్మకము, హరిశ్యామము అనే మూడు రకాల చందనం కనపడుతుంది. ఇవి కాకుండా అగ్నితుల్యము అనే చందనం కూడా ఉంటుంది, కాని మీరు పొరపాటున కూడా ఆ చందనాన్ని ముట్టుకోకండి. అక్కడ శైలూషుడు, గ్రామణి, శిక్షుడు, శకుడు, బభ్రువు అనే 5 గంధర్వ రాజులు పరిపాలన చేస్తుంటారు. మీరు వారికి నమస్కారం చేసి ముందుకి వెళితే, పృద్వికి చివరన పుణ్యం చేసుకున్నవారు స్వర్గానికి వెళ్ళేవారు కనపడతారు. అదికూడా దాటిపోతే పితృలోకం వస్తుంది. ఇక అది దాటితే యమధర్మరాజు యొక్క సామ్రాజ్యం ఉంటుంది, అక్కడ పాపులు ఉంటారు. మీరు అది దాటి వెళ్ళలేరు. దక్షిణ దిక్కున అక్కడిదాకా వెళ్ళి వెతికిరండి" అన్నాడు.

తరువాత సుగ్రీవుడు సుషేణుడిని పిలిచి, ఆయనకి నమస్కరించి  "మీతో పాటు మరీచి మహర్షి యొక్క కుమారుడైన అర్చిష్మంతుడు, అర్చిర్మాల్యుడు మొదలైన వానరాలని తీసుకొని పడమర దిక్కుకి వెళ్ళండి. అప్పుడు మీరు సౌరాష్ట్ర, బాహ్లిక, చంద్ర, చిత్ర, కురు, పాంచాల, కోసల, అంగ, మగధ, అవంతి, గాంధార, కాంభోజ మొదలైన రాజ్యాలు, పట్టణాలు, గ్రామాలు వెతకండి. అలాగే మురచిపురం, జటాపురం కనపడతాయి, వాటిని కూడా వెతకండి. సిందు-సాగర సంగమ స్థానంలో, 100 శిఖరాలతో, పెద్ద చెట్లతో సోమగిరి అనే పర్వతం కనపడుతుంది. మీకు ఆ పర్వతం మీద రెక్కలున్న సింహాలు కనపడతాయి, అవి ఏనుగుల్ని ఎత్తుకుపోతుంటాయి, సముద్రంలోని తిమింగలాలని ఎత్తుకుపోతుంటాయి. అక్కడ సముద్రంలో పారియాత్రం అనే పర్వతం ఉంది, అది 100 యోజనాల విస్తీర్ణంలో ఉంటుంది. దానిమీద 24 కోట్ల గంధర్వులు ఉంటారు, వాళ్ళకి నమస్కారం చేసి ముందుకి వెళ్ళండి. అప్పుడు మీకు 100 యోజనాల ఎత్తయిన వజ్ర పర్వతం కనపడుతుంది. సముద్రంలో నాలుగోవంతు భాగంలో చక్రవంతం అనే పర్వతం ఉంటుంది, దానిమీద విశ్వకర్మ వెయ్యి అంచుల చక్రాన్ని నిర్మించాడు. ఆ చక్రాన్ని ఎవరూ తీసుకోకుండా చేస్తున్న హయగ్రీవుడు అనే రాక్షసుడిని శ్రీ మహావిష్ణువు చంపి ఆ చక్రాన్ని తీసుకున్నారు, అలాగే పంచజనుడు అనే మరొక రాక్షసుడిని చంపి శంఖాన్ని తీసుకున్నారు.

అక్కడినుంచి ముందుకి వెళితే మీకు ప్రాక్ జ్యోతిషపురం అనే ప్రాంత కనపడుతుంది, దానిని నరకాసురుడు పరిపాలిస్తున్నాడు. దాని తరువాత సర్వ సౌవర్ణ అనే పర్వతం కనపడుతుంది. ఆ పర్వతాల మీద ఏనుగులు, పందులు, పులులు, సింహాలు పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాయి. అదికూడా దాటిపోతే మేఘనం అనే పర్వతం కనపడుతుంది, ఈ పర్వతం మీదనే ఇంద్రుడు పాకశాసనుడు అనే రాక్షసుడిని సంహరించి దేవతల చేత అభిషిక్తుడయ్యాడు. ఆ తరువాత 60,000 బంగారు పర్వతాలు కనపడతాయి, వాటి మధ్యలో మేరు పర్వతం ఉంటుంది. ఆ పర్వత శిఖరం మీద ఉన్న ఏ వస్తువైనా బంగారంలా మెరిసిపోతుంది. ఈ మేరు పర్వతం నుండి అస్తమయ పర్వతం 10,000 యోజనాల దూరంలో ఉంది, ఇంత దూరాన్ని సూర్య భగవానుడు అర ముహూర్తంలో దాటి వెళ్ళిపోతాడు. అక్కడే విశ్వకర్మ చేత నిర్మింపబడ్డ భవనంలో పాశము పట్టుకొని ఉన్న వరుణుడు నివసిస్తూ ఉంటాడు. అక్కడినుంచి ముందుకి వెళ్ళాక బ్రహ్మగారితో సమానమైన మేరు సావర్ణి అనే మహర్షి కనపడతారు, ఆయనకి నమస్కారం చేసి సీతమ్మ ఎక్కడుంది అని అడగండి. ఇక అక్కడినుండి ముందుకి వెళ్ళడం కష్టం. కావున మీరందరూ అక్కడిదాకా వెతికి రండి" అన్నాడు.

తరువాత ఆయన శతబలి అనే వానరుడిని పిలిచి "శతబలి! నువ్వు లక్ష వానరములతో కలిసి ఉత్తర దిక్కుకి వెళ్ళు. నువ్వు మ్లేచ్ఛ, పులింద, శూరసేన, ప్రస్థల, భరత, కురు, మద్రక, కాంభోజ, యవన, శక, కౌరవ మొదలైన ప్రాంతములలో వెతకండి. ఆ తరువాత సుదర్శన పర్వతాన్ని, దేవసఖ పర్వతాన్ని వెతకండి. ఆ తరువాత 100 యోగానాల నిర్జనమైన ప్రదేశం ఉంటుంది. ఆ తరువాత విశ్వకర్మ నిర్మితమైన తెల్లటి భవనంలో యక్షులకు రాజైన కుబేరుడు నివసిస్తూ ఉంటాడు. అక్కడున్న క్రౌంచ పర్వతానికి ఒక కన్నం ఉంటుంది, అందులోనుండి దూరి అవతలివైపుకి వెళ్ళండి. అప్పుడు మీకు మైనాక పర్వతం కనపడుతుంది, అక్కడ కింపురుష స్త్రీలు నివాసం చేస్తుంటారు, మయుడు అక్కడే నివాసం ఉంటాడు. అక్కడే మీకు సిద్ధుల, వైఖానసుల, వాలఖిల్యుల ఆశ్రమాలు కనపడతాయి. అది కూడా దాటితే వైఖానస సరస్సు కనపడుతుంది, అందులో కుబేరుడి వాహనమైన సార్వభౌమము అనే ఏనుగు ఆడ ఏనుగులతో కలిసి స్నానం చేస్తుంది. ఆ తరువాత ఆకాశం ఒక్కటే ఉంటుంది. భయపడకుండా అది కూడా దాటితే శైలోదం అనే నది వస్తుంది. ఆ నదికి అటూ ఇటూ కీచకములు అనే వెదుళ్ళు ఉంటాయి, ఆ వెదుళ్ళ మీద ఋషులు అటూ ఇటూ దాటుతుంటారు. అక్కడినుండి ముందుకి వెళితే సిధ్దపురుషుడు కనపడతాడు. అది కూడా దాటితే పుణ్యాత్ములకు నివాసమైన ఉత్తరకురు దేశం కనపడుతుంది. అక్కడ ఎన్నో వేల నదులు ప్రవహిస్తుంటాయి, అన్ని నదులలోను వెండి పద్మాలు ఉంటాయి. వాటినుండి రజస్సు నీళ్ళల్లో పడుతూ ఉంటుంది, అందువలన ఆ నీరు సువాసనలు వెదజల్లుతుంటుంది. అక్కడ చిత్రవిచిత్రమైన చెట్లుంటాయి, ఆ చెట్ల కింద నిలుచుని ఒక కోరిక కోరితే, ఆ కోరికలకి సంబంధించినది ఆ చెట్టుకి వస్తుంది. అక్కడినుంచి ముందుకి వెళితే మీకు సంగీత ధ్వనులు వినపడతాయి, అక్కడ ఎందరో సంతోషంగా తపస్సు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళాక మీకు దుఃఖం అన్నది ఉండదు. అది దాటిపోతే ఉత్తర సముద్రం కనపడుతుంది, ఆ సముద్రం మధ్యలో సోమగిరి అనే పర్వతం ఉంటుంది. సూర్యుడు లేకపోయినా ఆ పర్వతం ప్రకాశిస్తూ ఉంటుంది. అదికూడా దాటి వెళ్ళిపోతే ఒక పర్వతం మీద బ్రహ్మాండమైన, రమ్యమైన మందిరం కనపడుతుంది. 

అక్కడ శంకరుడు11 రుద్రులుగా వచ్చి కూర్చుంటాడు. ఆ పక్కనే బ్రహ్మగారు వేదాన్ని బ్రహ్మర్షులకి చెప్తుంటాడు. ఇక అది దాటి ఏ ప్రాణి వెళ్ళలేదు. మీరు అక్కడిదాకా వెళ్ళి సీతమ్మని వెతకండి. ఒక నెల సమయంలో సీతమ్మ జాడ కనిపెట్టండి" అని చెప్పాడు. 

తరువాత సుగ్రీవుడు హనుమంతుడితో "హనుమా! నీకున్న పరాక్రమము, నీకున్న తేజస్సు, నీకున్న వేగము, నీకున్న బుద్ధి ఈ భూమండలంలో ఏ ప్రాణికి లేవు. నీ తండ్రి వాయుదేవుడికి ఎటువంటి గమన శక్తి ఉందో నీకు అటువంటి గమన శక్తి ఉంది. అందుకని నేను నీమీదే ఆశ పెట్టుకుంటున్నాను, ఎలాగైనా సీతమ్మ జాడ నువ్వు కనిపెట్టాలి" అన్నాడు. 

ఇన్ని కోట్ల వానరాలు ఉండగా సుగ్రీవుడు కేవలం హనుమంతుడితో ఇలా చెప్పడం వల్ల రాముడికి హనుమంతుడి మీద నమ్మకం ఏర్పడింది. అప్పుడాయన హనుంతుడితో "నాయనా! నువ్వు సీత దెగ్గరికి వెళ్ళగానే వానర రూపంలో ఉన్న నిన్ను చూసి రాక్షసుడు అనుకొని బెంగపెట్టుకుంటుందేమో. అందుకని నీకు ఈ ఉంగరం ఇస్తున్నాను, ఈ ఉంగరాన్ని సీతకి చూపిస్తే ఆమె సమాస్వాసం పొందుతుంది" అని హనుమంతుడికి రాముడు తన ఉంగరాన్ని ఇచ్చాడు. 

అప్పుడు హనుమంతుడు ఆ ఉంగరాన్ని తన తల మీద పెట్టుకొని, రాముడికి సాష్టాంగ నమస్కారం చేసి బయలుదేరడానికి సిధ్దపడ్డాడు. సుగ్రీవుడు వానరులందరినీ "బయలుదేరండి" అని ఆదేశించాడు. 

అప్పుడు ఆ వానరాలు చాలా సంతోషంగా కేకలు వేశారు. వాళ్ళల్లో ఒకడు 'ఒరేయ్! మీరందరూ ఎందుకురా నేనొక్కడినే సీతమ్మ జాడ కనిపెట్టేస్తాను' అని అంటున్నాడు. మరొకడు 'నేను భూమిని చీల్చేస్తానురా' అని అంటున్నాడు. ఇంకొకడు 'నేను సముద్రాల్ని కలిపెస్తాను' అని, మరొకడు 'నేను పర్వతాలని కుదిపెస్తాను' అని అంటున్నాడు. 'నేను వెళ్ళిన త్రోవలో ఇక చెట్లు ఉండవు, నా తొడల వేగానికి విరిచేస్తాను రా' అని ఒకడు అంటున్నాడు. 'మీరందరూ విశ్రాంతి తీసుకొండిరా, ఆ పదితలల పురుగుని తీసుకొచ్చి రాముడి పాదాల దెగ్గర పడేస్తాను' అని ఒకడు అంటున్నాడు. అలా అందరూ తొడలు కొట్టుకుంటూ, తోకలకి ముద్దులు పెట్టుకుంటూ, పైకి కిందకి ఎగురుతూ సంతోషపడిపోతున్నారు. అలా అందరూ సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం నాలు దిక్కులకి వెళ్ళిపోయారు.

అప్పుడు రాముడు సుగ్రీవుడితో "ఇన్ని దిక్కులలో ఉన్న విశేషాలు నీకు ఎలా తెలుసయ్య సుగ్రీవా?" అన్నాడు. 

సుగ్రీవుడు అన్నాడు "నన్ను చంపుతానని వాలి వెంటపడితే ఈ భూమి చుట్టూ తిరిగాను, ఇవన్నీ అప్పుడు చూశాను. నేను ఎక్కడికి వెళ్ళినా వాలి నావెంట పడ్డాడు. ఆఖరికి హనుమంతుడు వాలికి ఉన్న శాపం గురించి చెబితే అప్పుడు ఋష్యమూక పర్వతం మీద కూర్చున్నాను" అన్నాడు.

అలా వానరాలన్నీ నాలుగు దిక్కులకి వెళ్ళడం వల్ల రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు సంతోషించారు.